Elephant Muthu Raja: బహుమతిగా ఇచ్చిన ఏనుగును కాపాడుకో లేకపోయినా శ్రీలంక.. చివరికి?

సుమారు 20 ఏళ్ల కిందట థాయ్ రాజు శ్రీలంకకు ఏనుగును బహుమతిగా అందించారు. కాగా 2001లో థాయ్‌ రాజకుటుంబం ఈ ఏనుగును శ్రీలంకకు బహూకరించింది. అప్పటిక

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 04:37 PM IST

సుమారు 20 ఏళ్ల కిందట థాయ్ రాజు శ్రీలంకకు ఏనుగును బహుమతిగా అందించారు. కాగా 2001లో థాయ్‌ రాజకుటుంబం ఈ ఏనుగును శ్రీలంకకు బహూకరించింది. అప్పటికి దాని వయసు 10 సంవత్సరాలు. థాయిలాండ్‌లో ఈ ఏనుగును సాక్‌ సురిన్‌, మైటీ సురిన్ అని పిలుస్తారు. శ్రీలంక చేరుకున్న తర్వాత దానికి ముత్తురాజా అని పేరు పెట్టారు. ఒక బుద్ధిస్ట్‌ టెంపుల్‌లో దాన్ని ఉంచి మతపరమైన వేడుకల్లో పాల్గొనేలా శిక్షణ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న ఏనుగు ఆరోగ్యం బాగా లేకపోయినా ప్రదర్శనలు చేయిస్తున్నారని ఇటీవలి కాలంలో విమర్శలు వెల్లువెత్తాయి.

2020లోనే దాని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ర్యాలీ ఫర్‌ యానిమల్‌ రైట్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్ అనే సంస్థ వెల్లడించింది. కొన్ని కఠినమైన పనులు కూడా ముత్తు రాజాతో చేయిస్తున్నారని ఆ సంస్థ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఏనుగుని దుంపలు లాగే పనిలో కూడా ఉపయోగించారని, అదుపులో పెట్టే క్రమంలో కొంత మంది దాన్ని గాయపరిచినట్లు రేర్ సంస్థ గుర్తించింది. దాంతో కాందే విహారాయ టెంపుల్ నుంచి దానికి విముక్తి కల్పించాలని ఆ సంస్థ శ్రీలంక ప్రభుత్వానికి విన్నవించింది. అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఏనుగును తిరిగి తీసుకెళ్లాలని ఏకంగా థాయ్‌లాండ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

శ్రీలంక, థాయిలాండ్‌ దేశాలు ఏనుగును పవిత్ర జంతువుగా కొలుస్తాయి. అలాంటి జంతువు విషయంలో రెండు దేశాల మధ్య దౌత్య పరమైన వివాదం చెలరేగింది. రేర్‌ విజ్ఞప్తి మేరకు టెంపుల్‌లో పరిస్థితిని ఆరా తీయమని థాయ్‌ ప్రభుత్వం శ్రీలంకలోని థాయ్‌ రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది. దాంతో దౌత్య అధికారులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ ఏనుగు ఆరోగ్యం బాగాలేదని, దాని జీవన స్థితి దీనంగా ఉన్నట్లు గుర్తించారు. అది తక్కువ బరువుతో బలహీనంగా ఉంది. దాని చర్మం కరకుగా మారింది. రెండు చోట్ల గడ్డలు ఏర్పడ్డాయి. అరి పాదాలు పలుచనై పోయాయి. నడవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. ఈ వివరాలన్నీ థాయ్‌ విదేశాంగ మంత్రిత్వశాఖకు నివేదించారు.

Elephant Muthu Raja

అయితే చివరకు థాయ్‌ ప్రభుత్వ జోక్యంతో గతేడాది నవంబర్‌లో ఏనుగును కొలంబోలోని నేషనల్ గార్డెన్‌కు తరలించారు. అక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. కానీ, సౌకర్యాల లేమి కారణంగా పూర్తి స్థాయి చికిత్స అందలేదు. మెరుగైన వైద్య సదుపాయాలు అక్కడ లేవని శ్రీలంక జంతు వైద్యులు తేల్చి చెప్పారు. ఇక ముత్తు రాజా ఆరోగ్యం కొంత మెరుగు పడినట్లు నిర్ధారించుకున్న తరువాత దాన్ని స్వదేశం రప్పించేందుకు థాయ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఇల్యూషిన్‌ 2- 76 కార్గో విమానాన్ని శ్రీలంకకు పంపించింది. 4వేల కిలోల బరువున్న ఏనుగును ఒక ఇనుప పెట్టెలో ఉంచి విమానంలోకి ఎక్కించారు. దాని వెంట ఇద్దరు జంతు వైద్యులు, నలుగురు మావటిలు ఉన్నారు. అలా సుమారు ఐదు గంటలు ప్రయాణించి థాయిలాండ్‌లోని చియాంగ్‌ మాయ్‌ నగరానికి దాన్ని చేర్చారు. ఈ రవాణాకు సుమారు రూ.4 కోట్లు ఖర్చయినట్లు థాయ్‌ పర్యావరణ శాఖ మంత్రి వరావుట్‌ శిల్పా తెలిపారు.