Site icon HashtagU Telugu

Vizag:రింగ్ వ‌ల‌ల వివాదానికి చెక్‌…ప‌రిష్కారానికి మంత్రుల క‌మిటీ

Fishermen

Fishermen

విశాఖలో రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఇరువర్గాలు సముద్రం మధ్యలో వేటకు దిగాయి. అందుబాటులో ఉన్న అన్ని పోలీసు బలగాలు, ప్రత్యేక సర్వీసులు, సైన్యంతో నిరసనను ఆపేందుకు అధికారులు ప్రయత్నించారు. కాగా, విశాఖపట్నం ఆర్డీఓ కె.పెంచల కిషోర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మత్స్యకారులతో సమావేశమైనా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రెండు గ్రామాల మత్స్యకారులతో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, సీదిరి అప్పలరాజు, ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా సమావేశమయ్యారు.ఈ సమావేశం అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జిల్లా అధికారులతో కమిటీ వేశామన్నారు. ఈ నెల 20వ తేదీలోగా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. మత్స్యకార గ్రామాల్లో రేపటి నుంచి 144, 145 సెక్షన్లు తొలగిస్తున్నామని, రేపటి నుంచి నిబంధనల ప్రకారం మత్స్యకారులు చేపల వేట కొనసాగించవచ్చని ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.