Konaseema: కోన‌సీమ‌లో నిరసన జ్వాలలు.. మంత్రి ఇంటికి నిప్పు!

అమ‌లాపురంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. కోన‌సీమ జిల్లా మార్పుపై జిల్లా సాధ‌న‌స‌మితి నిర‌స‌నకు పిలుపునిచ్చింది.

  • Written By:
  • Updated On - May 25, 2022 / 12:49 AM IST

అమ‌లాపురంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. కోన‌సీమ జిల్లా మార్పుపై జిల్లా సాధ‌న‌స‌మితి నిర‌స‌నకు పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో పెద్ద సంఖ్య‌లో ఆందోళ‌న‌కారులు రోడ్డెక్కారు. అయితే జిల్లాలో ఎలాంటి ర్యాలీల‌కు అనుమ‌తి లేద‌ని పోలీసులు తేల్చి చెప్పారు.ప్రస్తుత కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని కోరుతూ మంగళవారం జిల్లా కేంద్రమైన అమలాపురంలో భారీ ఎత్తున ర్యాలీ చేసేందుకు ఆందోళనకారులు సిద్ధమయ్యారు. పెద్దఎత్తున యువ‌కులు అమలాపురం చేరుకున్నారు.

పరిస్థితి చేయి దాటి పోవడంతో స్వయంగా కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. లాఠీ చేతబట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అమలాపురంలో ఎక్కడికక్కడ యువకులను అడ్డుకుంటున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసుల‌పై ఆందోళ‌న‌కారులు రాళ్ల దాడి చేయ‌డంతో ఎస్పీ, గ‌న్‌మెన్‌, మ‌రికొంత మంది పోలీసుల‌కు గాయాలైయ్యాయి. మంత్రి విశ్వ‌రూప్ ఇంటికి కూడా ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు. ఆందోళ‌న నేపథ్యంలో ఆయ‌న‌, కుటుంబ‌స‌భ్యులు ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. ఆయ‌న నివాసంలో ఉన్న వాహ‌నాలు, ఫ‌ర్నీచ‌ర్ ను ఆందోళ‌న‌కారులు ధ్వ‌సం చేశారు.