Nampally : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేశ్ బిదూరి చేసిన వ్యాఖ్యలు కలకల రేపుతున్నాయి. ఢిల్లీ రోడ్లను ప్రియాంకాగాంధీ బుగ్గల్లా మారుస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఈక్రమంలోనే హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యత్నించారు. వారిని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లు రువ్వడంతో వివాదం మరింత పెద్దదిగా మారింది.
ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో కొందరు గాయపడ్డారు. రమేశ్ బిదూరి ఫొటోను చెప్పులతో కొడుతూ హంగామా చేశారు. రమేశ్ బిదూరి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దాడిలో బీజేపీ దళితమోర్చా కార్యకర్త తలకు గాయమైంది. ఈ క్రమంలో అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
కాగా, ఇటీవల ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి మాట్లాడతూ.. తనను కనుక గెలిపిస్తే కల్కాజీలోని రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల్లా అందంగా చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా పెద్ద ఎత్తున కాషాయ శ్రేణులు బీజేపీ ఆఫీసుని ముట్టడించేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.