Site icon HashtagU Telugu

Bihar Violence: ససారంలో ఉద్రిక్త పరిస్థితులు, ఓ ఇంట్లో పేలిన బాంబు, నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

Sasaram

Sasaram

బీహార్ లో (Bihar Violence) హింసాకాండ కొనసాగుతోంది. రోహ్తాస్ జిల్లా ససారంలో, శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన వివాదంతో హింస తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం తెల్లవారుజామున ససారంలో మళ్లీ భారీ పేలుడు శబ్ధం వినిపించింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ససారం సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచి తోలాలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం ఎస్‌ఎస్‌బీ జవాన్లను ఇక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ వాతావరణం భయానకంగా మారింది. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బీహార్‌షరీఫ్‌లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా బీహార్‌లోని ససారంలో హింసాత్మక సంఘటనలు తెరపైకి వచ్చాయి, ఇందులో చాలా మంది గాయపడ్డారు. రెండు నగరాల్లో పోలీసులు భద్రతను పెంచారు. పలు పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటి వరకు 109 మందిని అరెస్టు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వయంగా అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. అక్రమార్కులను గుర్తించడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హింసాత్మక సంఘటనల తరువాత, ససారం, బీహార్ షరీఫ్‌లలో ఏప్రిల్ 4 వరకు ఇంటర్నెట్ సేవలను మూసివేయాలని నిర్ణయించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రెండు నగరాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ససారంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పుకార్లకు దూరంగా ఉండాలని పోలీసు బృందం ప్రజలకు సూచించింది. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఐదు లక్షల పరిహారం ప్రకటించారు.