Border-Gavaskar Trophy 2024: వరల్డ్ క్రికెట్ లో రెండు అత్యుత్తమ జట్లుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా పోటీపడుతుంటే ఫ్యాన్స్ కు పండగే… గత కొన్నేళ్ళుగా ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన టీమిండియా వరుసగా రెండుసార్లు బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. అది కూడా ఆసీస్ గడ్డపై సంచలన విజయాలతో కంగారూలకు చుక్కలు చూపించింది. ఇప్పుడు మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసింది. నవంబర్ నెలాఖరు నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుండగా.. ఆసీస్ క్రికెటర్లు అప్పుడే మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. ఈ సారి టెస్ట్ సిరీస్ లో విజయం తమదే అంటూ ఆసీస్ స్పిన్నర్ నాథన్ ల్యాన్ చెబుతున్నాడు. పనిలో పనిగా భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను టార్గెట్ చేసాడు.
గత రెండేళ్ళుగా జైశ్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఇంగ్లాండ్ పై అతని బ్యాటింగ్ ను చూశామంటూ వ్యాఖ్యానించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే జైశ్వాల్ ను అడ్డుకోవడం కష్టమేనని కితాబిచ్చాడు. అయితే ఆసీస్ పిచ్ లపై ఆడడం అతనికి అంత సులభం కాదన్నాడు. ఆసీస్ బౌన్సీ పిచ్ లు జైశ్వాల్ కు సవాల్ విసురుతాయని, ఇదే తమకు కలిసొస్తుందంటూ చెప్పుకొచ్చాడు. గత రెండు సిరీస్ లలో ఓడిపోవడం నిరాశ కలిగించినా.. ఈ సారి ఖచ్చితంగా బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీ తామే సొంతం చేసుకుంటామని సవాల్ చేశాడు. కాగా జైశ్వాల్ టెస్ట్ కెరీర్ అద్భుతంగా సాగుతోంది. విండీస్ పై అరంగేట్రంలోనే శతక్కొట్టిన ఈ యువ ఓపెనర్ ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో దుమ్మురేపాడు. 712 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓవరాల్ గా జైశ్వాల్ టెస్ట్ కెరీర్ చూస్తే ఇప్పటి వరకూ 9 టెస్టుల్లో 68 సగటుతో 1028 పరుగులు చేయగా.. దీనిలో మూడు శతకాలు, 4 అర్థసెంచరీలతో పాటు ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.
ఇదిలా ఉంటే అటు ఆసీస్ స్పిన్నర్ నాథన్ ల్యాన్ కు కూడా భారత్ పై మంచి రికార్డే ఉంది. భారత్ పై 27 టెస్టులు ఆడిన ల్యాన్ 121 వికెట్లు పడగొట్టగా…దీనిలో 9 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అలాగే లెఫ్ట్ హ్యాండర్లను ఔట్ చేయడంలోనూ పై చేయి సాధించాడు. మొత్తం మీద ఈ సారి కూడా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Sugar: ఏంటి చక్కెర తీసుకోవడం తగ్గిస్తే ఆ సమస్యలన్నీ దూరం అవుతాయా!