Site icon HashtagU Telugu

Electricity Staff: వేతనాల పెంపుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు షాక్

బంగారు తెలంగాణ కల సాకారం కావాలంటే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి. అలా ఉండాలి అంటే ఆదాయం దండిగా కనిపించాలి. కానీ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల్లో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదు. ఎందుకంటే వేతన పెంపుపై వారికి గట్టి షాక్ తగిలింది. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కనీసం ఏడాదిపాటు వేతన సవరణను వాయిదా వేసుకోవాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కోరాయి.

వేతనాల పెంపు గురించి ఇప్పుడిప్పుడే అడ‌గ‌కూడ‌ద‌ని విద్యుత్తు సంస్థలు తేల్చి చెప్పేసినట్టే. ఉద్యోగ‌, కార్మిక సంఘాల నాయ‌కుల స‌మావేశంలో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవుల‌ప‌ల్లి ప్రభాక‌ర‌రావు, ఇత‌ర ఉన్నతాధికారులు ఈమేరకు సూచించారు. ఇప్పటికే రూ.4,097 కోట్ల మేర రెవెన్యూ లోటు ఉంది. దీన్ని పూడ్చడంతో పాటు, ఇత‌ర న‌ష్టాల భ‌ర్తీ కోసం.. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్సరంలో రూ.6,831 కోట్ల మేర ఛార్జీలు పెంచాల‌ని ప్రతిపాదించామ‌న్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రెప్పపాటైనా కరెంట్ పోకుండా చూస్తోంది. ఎన్నికల ప్రచారంలో కాని, ఇతర సందర్భాల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా గురించి సీఎం కేసీఆర్ కూడా చెబుతూ ఉంటారు. ఇలా నిరంతర విద్యుత్ ను అందించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం గత ఏడేళ్లుగా అనుమతిని ఇవ్వలేదు. దీంతో వచ్చే ఆదాయం సరిపోకపోవడం, ఖర్చులు పెరిగిపోవడంతో విద్యుత్ సంస్థలకు నష్టాలు తప్పలేదు.

ఆదాయం పెరగకపోవడంతోపాటు అదే సమయంలో ఉద్యోగుల జీతాలు 150 శాతం మేర పెరిగాయని ప్రభాకరరావు గుర్తుచేశారు. అందుకే ఈసారికి ప‌రిస్థితిని అర్థం చేసుకోవాల‌ని కోరారు. ఒకవేళ కాదూ కూడ‌దు పెంచాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డితే వేత‌న స‌వ‌ర‌ణ సంఘం ( పే రివిజన్ క‌మిటీ – పీఆర్‌సీ)ను వేస్తామ‌ని తెలిపారు. అయితే ఉద్యోగులు.. జీతాలు పెంపు త‌ప్ప ఇత‌ర‌ కోర్కెలు కోర‌కూడ‌ద‌ని ముందే కండీషన్ పెట్టారు.