Site icon HashtagU Telugu

CM KCR: ఉడుత‌ ఊపుల‌కు, పిట్ట బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదు!

Cm Kcr

Cm Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పరోక్షంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. న‌రేంద్ర మోదీతో రెండేండ్ల నుంచి పంచాయితీ న‌డుస్తోంది. క‌రెంట్ సంస్క‌ర‌ణ పేరిట మోదీ మోసం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనగామ సభలో ఆయన ఏం అంశాలు లేవనెత్తారంటే..?

జ‌న‌గామ జిల్లాను ఏర్పాటు చేసుకోవ‌డ‌మే కాకుండా.. అద్భుత‌మైన ప‌రిపాల‌న భ‌వ‌నం క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించుకున్నాం. ఈ సంద‌ర్భంగా జిల్లా అధికారుల‌ను, ప్ర‌జ‌ల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. జ‌య‌శంక‌ర్ సార్ బ‌తికున్న‌ప్పుడు ఉద్య‌మ స‌మ‌యంలో ప‌ర్య‌టిస్తున్న‌ప్పుడు ఈ ప్రాంతంలో అనేక బాధ‌లు ఉండేవి. క‌ళ్ల‌కు నీళ్లు పెట్టుకున్నాం. బ‌చ్చ‌న్న‌పేట మీదుగా పోతుంటే.. మాట్లాడాలంటే చౌర‌స్తా వ‌ద్ద ఆగాను. అక్క‌డ ఒక్క యువ‌కుడు కూడా లేడు. మొత్తం ముస‌లివారే. క‌రువు వ‌చ్చి ఏడేండ్లు అవుతుంది. మంచినీళ్లు కూడా బండి మీద తెచ్చుకుంటున్నాం అని చెప్తే ఆవేశం ప‌ట్ట‌లేక ఏడ్చాను.

అనేక సంద‌ర్భాల్లో నీళ్ల కోసం ముత్తిరెడ్డి.. రాజ‌య్య‌, సునీత‌తో కొట్లాడాడు. చాలా క‌ష్ట‌ప‌డి నీళ్లు తెచ్చుకున్నాం. ప్ర‌జ‌ల దీవెనతో అద్భుతంగా ముందుకు పోతున్నాం. కొన్ని మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇప్పుడే ముఖం తెల్ల‌ప‌డుతుంది. బ‌చ్చ‌న్న‌పేట వ‌ద్ద బ‌తుకులు బాగుప‌డుతున్నాయి. పంట‌లు మోయ‌లేనంత పండిస్తున్నారు. ఇండ్ల‌కే మంచినీళ్లు వ‌స్తున్నాయి. 365 రోజులు గోదావ‌రి నీళ్లు తెచ్చి జ‌న‌గామ పాదాలు క‌డిగే రంగం సిద్ధ‌మైంది. సాగునీటి స‌మ‌స్య కొంత ఉంది. అది కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రిస్తాం. దేవాదుల నుంచి నీళ్లు వ‌స్తాయి. ఒక్క ఏడాది కాలంలోనే అన్ని గ్రామాల్లోని చెరువు నింపే బాధ్య‌త మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఉంది. ఏప్రిల్ నెల‌లో కూడా చెరువులు మ‌త్త‌డి దుంకాలి. ఘ‌న‌పురంలో డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. జ‌న‌గామ‌కు త‌ప్ప‌కుండా మెడిక‌ల్ కాలేజీ మంజూరు చేస్తాం. రెండు, మూడు రోజుల్లో జీవో ఇస్తాం. పాల‌కుర్తిలో కూడా డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం అని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట రైతుల‌ను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా స‌రే బావుల వ‌ద్ద‌ మోటార్లకు క‌రెంట్ మీట‌ర్లు పెట్టం అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఏ రాష్ట్రం పాల‌సీ ఆ రాష్ట్రానికి ఉండాల‌ని కేంద్రాన్ని ప‌లుమార్లు కోరాను. 30 -40 ఏండ్లు క‌రెంట్ లేక బాధ‌ప‌డ్డాం. 30 ల‌క్ష‌ల బోర్లు వేశాం. దాన్ని అధిగ‌మించాల‌ని చెప్పి చెరువుల‌ను బాగు చేసుకున్నాం. చెక్ డ్యామ్‌ల‌ను నిర్మించుకుంటున్నాం. భూగ‌ర్భ‌జలాలు పెరిగాయి. పెట్టుబ‌డి సాయం చేస్తున్నాం. వ‌ల‌స‌లు పోయినొల్లు మ‌ళ్లీ తిరిగి వ‌స్తున్నారు. న‌రేంద్ర మోదీతో రెండేండ్ల నుంచి పంచాయితీ న‌డుస్తోంది. క‌రెంట్ సంస్క‌ర‌ణ పేరిట మోదీ మోసం చేస్తున్నారు. ప్ర‌తి మోటార్‌కు మీట‌ర్ పెట్టాల‌ని అంటే.. నన్ను చంపినా పెట్ట‌న‌ని చెప్పాను. ఎందుకంటే రైతు పంట పండిస్తే రైతే బ‌త‌క‌డు క‌దా? ఇప్పుడు డిజీల్ రేట్లు పెరిగాయి. దాంతో రైతుల‌కు ట్రాక్ట‌ర్ల‌తో దున్న‌డం భార‌మైంది. ఆదాయం రెట్టింపు చేయడం ఏమో కానీ.. రైతుల పెట్టుబ‌డి రెట్టింపు చేసిండు మోదీ. చంద్ర‌బాబు కూడా బావుల కాడ మీట‌ర్ పెట్టాల‌ని అన్న‌డు. న‌రేంద్ర మోదీ విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట బావుల కాడ మోటార్లు పెట్టాల‌ని అంటున్నారు.

మీరు పండించే ధాన్యం కొనం. క‌రెంట్ మీట‌ర్ పెట్టాలి. లేదంటే దాడులు చేస్తాం అని కేంద్రం అంటోంది. ఇదేనా దందా.. దీని కోస‌మేనా తెలంగాణ తెచ్చుకున్న‌ది. అనేక పోరాటాల త‌ర్వాత తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడిప్పుడే దారిన ప‌డుతున్నాం. అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ అన్ని వ‌ర్గాల‌ను ఆదుకుంటున్నాం.. అండ‌గా నిలుస్తున్నాం. గ్రామీణ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తున్నాం. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం రైతులు, పేద‌ల వెంబ‌డి ప‌డ్డాడు. ల‌క్ష‌ల కోట్లు కుంభ‌కోణాలు చేసి, బ్యాంకుల‌ను మోస‌గించిన వారికి టికెట్లు కొని లండ‌న్‌కు పంపిస్తారు. వాల్లు అక్క‌డ పిక్‌నిక్ చేస్తున్నారు. మోదీ మా ప్రాణం పోయినా స‌రే క‌రెంట్ బావుల‌కు మోటార్లు పెట్టం. నువ్వు ఏం చేసినా మంచిదే. తిర‌గ‌బ‌డుతాం. కొట్లాడుతాం. అవ‌స‌ర‌మైతే ఢిల్లీ దాకా వ‌స్తాం. ఏం చేస్తావో చేసుకో. విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయం. దీన్ని మీద తెలంగాణ మొత్తం అప్ర‌మ‌త్తం కావాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తాం. దేశం గురించి కూడా కొట్లాడాలి. జాతీయ రాజ‌కీయాల్లో ప్రాతినిధ్యం వ‌హించాలి. సిద్దిపేట ప్ర‌జ‌లు న‌న్ను ఆశీర్వ‌దించి అసెంబ్లీకి పంపితే తెలంగాణ‌ను సాధించాం. మీరు కూడా దీవెన‌లు ఇస్తే ఢిల్లీ కోట‌ల‌ను బ‌ద్ధ‌లు కొడుతాం. జాగ్ర‌త్త న‌రేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ‌. మీ ఉడుత‌ ఊపుల‌కు, పిట్ట బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదు. జ‌న‌గామ టౌన్‌లో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్ల‌ను మేం ట‌చ్ చేయం.. మ‌మ్మ‌ల్ని ముట్టుకుంటే నాశ‌నం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్ర‌స్ లేకుండా పోతారు. రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశాం. మీ జాగ్ర‌త్త‌లా మీరు ఉండండి. మా జాగ్ర‌త్త‌లా మేం ఉంటాం అని కేసీఆర్ సూచించారు.

ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వ‌రు. కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్వ‌రు. మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌రు. నువ్వు ఇవ్వ‌కున్నా మంచిదే. నిన్ను త‌రిమేసి.. ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటాం. ప్ర‌జ‌ల శ‌క్తితోనే తెలంగాణ‌ను సాధించుకున్నాం. అద్భుత‌మైన పంట‌ల‌ను పండించుకున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వ‌రుస‌లో ఉన్నాం అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.