వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తరువాత వీఆర్ఏ లపై పనిభారం విపరీతంగా పెరిగిందని వీఆర్ఏ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.
వీఆర్వో వ్యవస్థ రద్దు తరువాత వీఆర్ఏ లకు అసలు ప్రమోషన్లే ఇవ్వలేదని, వీఆర్వో వ్యవస్థ రద్దు చేశారు కానీ వారికి ఇంతవరకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో ప్రభుత్వానికే స్పష్టత లేదని వీఆర్ఏ ఉద్యోగుల జేఏసీ విమర్శించింది.
పెరిగిన పనిభారంకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పే-స్కేల్ అమలు చేస్తానని చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్ఏ లకు పే-స్కేల్ అమలు చేసి ఉద్యోగులతో సమానంగా 30% వేతనం పెంచాలని,దానికి సంబంధించిన జీఓ వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
వీఆర్ఏ లకు తాము పని చేస్తున్న స్థలంలోనే డబుల్ బెడ్ రూం మంజూరు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వలేదని, మరోవైపు ఇసుక మాఫియా చేతిలో వీఆర్ఏలు హత్యకు గురవుతున్నారని, చాలీ చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులతో కూడా వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల
సమస్యలు పరిష్కరించాలని, లేదంటే భవిష్యత్ పోరాటానికి సిద్ధమవుతామని వీఆర్ఏ జేఏసీ తెలిపింది.