Site icon HashtagU Telugu

Ibrahimpatnam Family Planning: వికటించిన కు.ని సర్జరీలు.. నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య

Harish Imresizer

Harish Imresizer

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం రేగింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించి నలుగురు మహిళలు చనిపోయారు. వరుసగా 3 రోజుల్లో ఈ నలుగురు మహిళలు చనిపోవడం గమనార్హం.
అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న మిగతా 30 మందిని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో 11 మందికి, నిమ్స్‌లో 12మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు డీహెచ్​ ఆధ్వర్యంలో ఐదుగురు నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది.మృతుల పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వారి మరణానికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించింది.

ఆగస్టు 25న..

ఇబ్రహీం పట్నంలోని సామాజిక  ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. సామూహిక స్టెరిలైజేషన్ శిబిరంలో భాగంగా 34 మందికి నిర్వహించిన శస్త్ర చికిత్సల్లో కొంతమందికి వికటించాయి. మూడ్రోజుల తర్వాత కొందరు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. 28న నర్సాయిపల్లికి చెందిన మమత చికిత్సపొందుతూ చనిపోయింది. సోమవారం మంచాల మండలం లింగంపల్లి వాసి సుష్మ మృతిచెందింది. సీతారాంపేటకు చెందిన లావణ్య, కొలకులపల్లికి చెందిన మౌనిక చికిత్స పొందుతూ మరణించారు.

చర్యలు..

ఈనేపథ్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యుడి లైసెన్స్‌ ను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం, రెండు పడకల గదుల ఇళ్లు కేటాయిస్తామని వెల్లడించారు. రోజుకు 30 కుటుంబ ఆపరేషన్లు చేయాలి కానీ ఆరోజు 34 చేశారని తెలుస్తోంది.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, పిల్లలకు రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉచితంగా విద్యనందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.