Site icon HashtagU Telugu

Telangana Police: పోలీస్ సంక్షేమానికై ‘తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ’ ఏర్పాటు – ‘డీజీపీ మహేందర్ రెడ్డి’

Ts Police

Ts Police

దాదాపు ఒక లక్షకు పైగా అధికారులు, సిబ్బంది ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తమ అధికారులు, సిబ్బంది సంక్షేమానికై మరో ముందగు వేసింది. ఇప్పటికే ఆరోగ్య భద్రతా ఏర్పాటు ద్వారా పోలీసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించిన పోలీస్ శాఖ… ప్రతీ అధికారి, సిబ్బంది తమ పదవీ విరమణలోగా కనీసం ఒక ఇంటిని లేదా ఫ్లాట్ ను కలిగి ఉండేలా తగు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ‘తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ’ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సొసైటీ నిర్వహణతీరు, దీని ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) రాష్ట్రంలోని పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ. లు, యూనిట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడిషనల్ డీజీ లు ఉమేష్ షరాఫ్, జితేందర్ లు కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో… డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర పోలీస్ అధికారుల సంక్షేమానికై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటుకు అనుమతించడమే కాకుండా, ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా సహకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య భద్రతా మాదిరిగానే పోలీసులకు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించాలని సీఎం కేసీఆర్ ను కోరగా, ఇందుకై ప్రత్యేకంగా మూల ధనాన్ని పెంపొందించుకునేందుకై పోలీస్ శాఖ ఖాళీ స్థలాల్లో పెట్రోల్ పంపులు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికై అనుమతిచ్చారని డీజీపీ తెలిపారు.
దీనిలో భాగంగా ఇప్పటికే ప్రత్యేకంగా తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని… ఈ సొసైటీ కి స్వచ్ఛందంగా విరాళాలు అందించేవారికి, వివిధ కార్యక్రమాల ద్వారా పొందే ఆదాయానికి 80 జి, 12 ఏ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లభించిందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ సొసైటీ కి సమకూరే నిధులనుండి పోలీసు అధికారులకు ఇల్లు లేదా ఫ్లాట్ ల కొనుగోలుకు నామమాత్రపు వడ్డీపై రుణాలను అందించనున్నట్టు వివరించారు.

తెలంగాణలో సి.సి. టీవీ ల నిర్వహణకు ప్రత్యేక విభాగం:
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన దాదాపు 9 లక్షల సీసీ టీవీ ల నిర్వహణకై ప్రత్యేకంగా ‘తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ’ అనే సంస్థను ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున సీసీ టీవీ లను ఏర్పాటు చేసినప్పటికీ, వాటి నిర్వహణకై ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. దీనిని అధిగమించడానికి అడిషనల్ డీజీ జితేందర్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ’ అనే సంస్థను ఏర్పాటు చేసి, దీనిద్వారా సీసీటీవీ ప్రాజెక్ట్ నిర్వహణను నిరాటంకంగా కొనసాగిస్తామని వివరించారు. సీసీటీవీ ల నిర్వహణకై ప్రత్యేకంగా కామన్ సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సొసైటీ కి సి.ఎస్.ఆర్ కింద గానీ, స్వచ్ఛందంగా గానీ అందచేసే నిధులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా ప్రయత్నిస్తున్నామని డీజీపీ తెలిపారు.

కోవిడ్ మృతుల పోలీస్ కుటుంబాల పిల్లలకు స్కాలర్-షిప్ లను అందించిన డీజీపీ:
కోవిడ్-19 తో మరణించిన పోలీసు కుటుంబాల పిల్లలకు డీజీపీ మహేందర్ రెడ్డి స్కాలర్షిప్ లను అందించారు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందజేశారు. సి.ఎస్.ఆర్ పధకంలో భాగంగా హెచ్.డీ.ఎఫ్.సి బ్యాంకు, కరోనా మృతుల పోలీసు కుటుంబాల పిల్లలకు రూ.15 ,000 నుండి 75 ,000 వరకు అందించింది. ఈ ఆర్థిక సహాయం అందచేసిన కార్యక్రమంలో అడిషనల్ డీజీలు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, హెచ్.డీ.ఎఫ్.సి బ్యాంకు అధికారులు తరుణ్ చౌదరి, బద్రి విశాల్, జోస్ స్టీఫెన్ లు పాల్గొన్నారు.

Exit mobile version