Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించని స్పీకర్..!

  • Written By:
  • Publish Date - March 15, 2022 / 01:50 PM IST

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో, సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు ఉదయం ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు ఈరోజు అసెంబ్లీకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో త‌మ‌ను స‌భ‌లోకి సమావేశాలకు అనుమతించాలని అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని విజ్ఞ‌ప్తి చేస్తూ.. కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని స్పీక‌ర్‌కు సమర్పించారు.

అయితే స‌స్పెండ్ అయిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలోకి అనుమతించలేదు. ఈ క్ర‌మంలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్షన్స్‌ను ఎత్తివేసేది లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీంతో తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారని చెప్పిన‌ బీజేపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఇక‌పోతే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా స‌భ‌లో త‌ర‌చూ అడ్డంకులు సృష్టిస్తున్నందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేనందర్, రాజాసింగ్, రఘునందన్‌రావుల‌ను ఈ సెష‌న్ మొత్తం సస్పెండ్ చేస్తూ స్పీకర్ పోచారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించ‌గా, సస్పెన్షన్ పై తుది నిర్ణ‌యం స్పీకర్‌దే అని చెప్పిన‌ హైకోర్టు స్పీకర్‌ను కలవాలని ఆదేశించింది. ఈ క్ర‌మంలో బీజేపీ ఎమ్మెల్యేల అభ్య‌ర్ధ‌న‌ను స్పీక‌ర్ తిర‌స్క‌రించడంతో ముగ్గురు కాషాయ నేత‌ల‌కు మరోసారి నిరాశే ఎదురైంది.