White Challenge: రాహుల్ కు `వైట్ ఛాలెంజ్‌` స్వాగ‌తం

కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ వేడిని రాజేసింది.

  • Written By:
  • Updated On - May 5, 2022 / 03:06 PM IST

కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ వేడిని రాజేసింది. తాజాగా రాహుల్ కు `వైట్ ఛాలెంజ్` విసురుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్రధాన కూడ‌ళ్ల వ‌ద్ద ప్లెక్సీలు వెలిశాయి. ఈనెల 6, 7న రాహుల్ పర్యటన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో రాహుల్‌కు ‘వైట్ ఛాలెంజ్ విసురుతూ ‘రాహుల్ జీ.. మీరు వైట్ ఛాలెంజ్‌కి సిద్ధమా…?’ అని ఫ్లెక్సీలపై పెట్టారు. రెండు రోజుల క్రితం లీకైన రాహుల్ నేపాల్ నైట్ క్లబ్ వీడియోలోని ఫోటోలను కూడా ఫ్లెక్సీలపై ముద్రించారు. దీంతో ఒక్క‌సారిగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మ‌ధ్య పొలిటిక‌ల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఇటీవ‌ల తెర‌మరుగైన ఈ వైట్ ఛాలెంజ్ అంశం మ‌ళ్లీ తెరపైకి వచ్చింది. ఇటీవల రాహుల్ నైట్ క్లబ్ వీడియో లీకవడం శుక్ర‌వారం తెలంగాణలో ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ‘వైట్ ఛాలెంజ్’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

వైట్ ఛాలెంజ్‌కి కేటీఆర్ సిద్ధమని , రాహుల్ సిద్ధమా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌కి వైట్ ఛాలెంజ్ విసురుతూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇదే అంశంపై మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్‌కు ఒప్పుకుని తన వెంట్రుకలు ఇస్తారా? లేక రేవంత్ రెడ్డిని వెంట్రుకలా తీసి పడేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సంధిస్తున్న ఈ ‘వైట్ ఛాలెంజ్‌’పై కాంగ్రెస్ నేతలు స్పందించ‌డానికి అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు ‘వైట్ ఛాలెంజ్’ విసిరిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో సింగరేణి కాలనీ హత్యాచార ఘటనలో నిందితుడు గంజాయి మత్తులో చిన్నారిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలడంతో రేవంత్ రెడ్డే ‘వైట్ ఛాలెంజ్’ను తెరపైకి తీసుకొచ్చారు.

రేవంత్ వైట్ ఛాలెంజ్‌కి స్పందించిన కేటీఆర్తా, తాను వైట్ ఛాలెంజ్‌కి సిద్ధమని ,ఎక్కడికైనా వచ్చి తన శాంపిల్స్ ఇస్తానని ప్రకటించారు. అయితే ఇదే ఛాలెంజ్‌కు రాహుల్ సిద్ధమా అని ప్రతి సవాల్ విసిరిన విష‌యం విదిత‌మే. టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలోనూ ఈ వైట్ ఛాలెంజ్ క‌ల‌క‌లం రేపింది. డ్రగ్స్ కేసు నుంచి పలువురు నిందితులను తప్పించేందుకు టీఆర్ఎస్ నేత‌లు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. మంత్రి కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. దానిపై స్పందించిన‌ కేటీఆర్‌ తాను ఏ పరీక్షకైనా సిద్ధమేనని అన్నారు. మ‌ళ్లీ ఇప్పుడు వైట్ ఛాలెంజ్ తెర‌మీద‌కు రావ‌డం గ‌మ‌నార్హం.