కొన్నాళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ గవర్నర్ మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా ఉంది. తన విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించట్లేదని గవర్నర్ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో గవర్నర్ అతిగా వ్యవహరిస్తున్నారని.. ఏదేదో ఊహించుకుంటున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో అసలు కేసీఆర్, కేటీఆర్ లు గవర్నర్ గురించి ఏమనుకుంటున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ గురించి తన మనసులో ఏముందో కేటీఆర్ కుండబద్దలు కొట్టేశారు.
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య దూరం ఎక్కువగా ఉండదు. వాటి మధ్య బంధం కూడా దృఢమైనదే. కానీ గవర్నర్ గా తమిళిసై వచ్చిన తరువాత ప్రగతి భవన్ స్ట్రాటజీ మారింది. ముఖ్యంగా ఆమె గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా చేయడం.. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రధాన ప్రత్యర్థిగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో సీన్ మారిపోయింది. దీనికితోడు గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ముందుకు రావడం ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే అప్పటి నుంచి విభేదాలు మొదలైనట్టుగా ప్రచారం జరుగుతోంది.
గవర్నర్ అంటే ఏమిటో.. వాళ్లు ఏం చేయాలో ఇప్పుడు మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్పేశారు. అది నామినేటెడ్ పోస్ట్ అని.. రాజ్యాంగంలో గవర్నర్ పాత్ర చిన్నదని చెప్పారు. అయినా గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు.. రాజకీయాలతో సంబంధం లేనివారే గవర్నర్లుగా ఉండాలని చెప్పారని… సర్కారియా కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారని.. మరిప్పుడు పీఎం అయిన తరువాత వాటిని ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. గవర్నర్ విషయంలో గౌరవ మర్యాదలు పరస్పరం ఉండాలని తేల్చేశారు. మొత్తానికి గవర్నర్ తమిళిసై విషయంలో తన అభిప్రాయమేంటో కేటీఆర్ క్లియర్ గా చెప్పేసరికీ.. ఈ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదంటున్నారు విశ్లేషకులు.
