Niti Aayog: ఆరోగ్య సూచీలో కేరళ ఫస్ట్.. తెలంగాణ థర్డ్!

వైద్య ఆరోగ్య సేవల్లో రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులను ప్రకటించింది. 24 అంశాల్లో రాష్ట్రాల పనితీరుని గమనించిన నీతి ఆయోగ్ ఈ ర్యాంకులను ఇచ్చింది.

  • Written By:
  • Updated On - December 28, 2021 / 11:42 AM IST

వైద్య ఆరోగ్య సేవల్లో రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులను ప్రకటించింది. 24 అంశాల్లో రాష్ట్రాల పనితీరుని గమనించిన నీతి ఆయోగ్ ఈ ర్యాంకులను ఇచ్చింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో అన్ని విభాగాల్లో మంచి పనితీరు కనబరిచిన దక్షిణాది రాష్ట్రం కేరళ తొలిస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ అట్టుడుగున నిలిచింది. రాష్ట్రాల ఆరోగ్య ఫలితాలు, పాలన- సమాచారం, కీలక చర్యలు- ప్రక్రియను ఆరోగ్య సూచీకి ప్రాతిపదికగా తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ, ప్రపంచ బ్యాంకు సాంకేతిక సాయంతో ఈ నివేదికను తయారుచేశారు.

2019-20 ఏడాదిలో రాష్ట్రాల పనితీరు ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో వరుసగా నాలుగో ఏడాది కుడా కేరళనే ఈ సూచీలో ప్రధమస్థానంలో నిలిచింది. ఈ సూచిలోతర్వాతి స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. గతంలో మూడో స్థానంలో నిలిచిన ఏపీ తాజాగా నాలుగో స్థానానికి దిగజారింది. అన్ని అంశాలలోనూ యూపీ అత్యంత చెత్త పనితీరు కనబరిచింది. తెలంగాణ తర్వాత ఏడాది కాలం నుంచి ఆరోగ్య వ్యవస్థలు మెరుగపడిన రాష్ట్రంగా అస్సాం నిలిచింది. ఆరోగ్య పరిమితుల్లో చెత్త పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో యూపీ తర్వాత బీహార్, మధ్యప్రదేశ్‌లు నిలిచాయి. ఓవరాల్ పనితీరులో తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనబరిచి మూడవ స్థానంలో నిలిచినట్టు నీతి ఆయోగ్ తెలిపింది.

చిన్న రాష్ట్రాల కేటగిరిలో మిజోరాం అన్ని విభాగాల్లో అత్యుత్తమ పనితీరుతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో త్రిపుర ఉంది. ఇక చెత్త పనితీరు కనబరిచిన చిన్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాల కేటగిరిలో ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌లు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ లో చిట్టచివర స్థానం సాధించగా, ఇంక్రిమెంటల్ పనితీరు పరంగా అగ్రగామిగా నిలిచాయి.