Site icon HashtagU Telugu

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశం

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసుపై ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది రచనారెడ్డి వాదించారు. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయల్ వివరించారు. డ్రగ్స్ కేసులో డాక్యుమెంట్లు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది. ఈడీ అడుగుతున్న డాక్యుమెంట్లు ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. తమ వద్ద ఉన్న సమాచారమంతా ఈడీకి, కోర్టులకు ఇచ్చామని ప్రభుత్వ ప్రత్యేక జీపీ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లు, ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారులు సమర్పించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలని ఆదేశించింది.

ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని ఆదేశించింది. డ్రగ్స్ కేసులో రేవంత్‌రెడ్డి పిల్‌పై హైకోర్టు విచారణ ముగించింది. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. వివరాలు సమర్పించకపోతే తమను సంప్రదించవచ్చనని ఈడీకి హైకోర్టు సూచించింది. మాదకద్రవ్యాలు యువతపై తీవ్రం ప్రభావం చూపుతున్నాయని హైకోర్టు పేర్కొంది. దేశ ప్రయోజనాల కోసం ఈడీ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు సూచించింది

Exit mobile version