MLC Kavitha: ఆడబిడ్డల ఉద్యోగాలకు తెలంగాణలో భద్రత లేకుండా పోయింది: ఎమ్మెల్సీ కవిత

  • Written By:
  • Updated On - February 19, 2024 / 05:12 PM IST

MLC Kavitha: తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ”సీఎం రేవంత్‌రెడ్డి.. మీరు రాజకీయాలపై పెట్టిన శ్రద్ధ రోస్టర్‌ పాయింట్‌పై పెట్టి ఉంటే బాగుండేది. రోస్టర్‌ పాయింట్‌ రద్దును సవాల్ చేస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆగమేఘాల మీద ఆ కేసును ఎందుకు విత్‌డ్రా చేసుకున్నట్లు? మీరు కొత్త జీవో ఇచ్చేటప్పుడు మేధావులతో సంప్రదించారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం చేసే ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా” బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

ఈ మేరకు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆమె లేఖ రాశారు. ”1996లో అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఉపాధి అవకాశాల్లో 33.3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్‌ 41, 56 జారీ అయ్యాయి. దీనికి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారు. మన దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా అయితే ఉన్నాయో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోంది.

భయాందోళనలు సృష్టిస్తూ బిడ్డల చావుల మీద రాజకీయం చేసి ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆడబిడ్డలకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. రాజస్థాన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బిహార్, కర్నాటక వంటి రాష్ట్రాలు పాటించబోమని ప్రకటించాయని, మరి తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆతృత ఎందుకని ప్రశ్నించారు. కొత్త జీవో తీసుకొచ్చి తెలంగాణలో ఆడబిడ్డల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొడుతోందని మండిపడ్డారు. ఆడబిడ్డలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారెంటీ లేదంటే వారి తల్లిందండ్రులు చదువులు మానిపించే ప్రమాదం ఉందని అన్నారు. అందరూ ఆడబిడ్డల కోసం పోరాటం చేస్తున్న ఈ తరుణంలో ఉన్న హక్కలను హరించడాన్ని ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.