Mudumal: నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామంలో ఉన్న ప్రముఖ పురావస్తు కట్టడాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కోస తెలంగాణ హెరిటేజ్ శాఖ – దక్కన్ హెరిటేజ్ అకాడమీతో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంటేషన్, పరిరక్షణకు, సాంకేతికమైన సేవలు అందించడానికి ఒప్పంద పత్రాలను అందజేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాములు నాయక్, హెరిటేజ్ అకాడమీ ట్రస్టు ప్రతినిధులు కట్ట ప్రభాకర్ ప్రొఫెసర్ KP రావు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…యునెస్కో గుర్తింపుకు అర్హమైన గొప్ప చారిత్రక మరియు నిర్మాణ వారసత్వ సంపద తెలంగాణకు ఉందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని మానవుల కాలం నాటి అంతరిక్ష పరిశోధనలు మరియు వాతావరణ పరిశోధనలలో అనేకమంది చరిత్రకారులు మరియు పరిశోధకులు తెలంగాణ ఖ్యాతిని ధృవీకరించారని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తూనే ఉన్నారన్నారు.
ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం 1500 BC నాటిది. ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితం వరకు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పొడవాటి రాళ్లు ఇప్పుడు కొన్ని ఎకరాల్లో మాత్రమే ఉన్నాయి. ఈ భూమి కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం దాని పరిరక్షణకు చర్యలు ప్రారంభించింది.