Site icon HashtagU Telugu

T-Congress: ఈడీపై టీకాంగ్రెస్ సమరం

Tcongress

Tcongress

న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని విచారణకు పిలిపించినందుకు నిరసనగా టీ-కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. గురువారం హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశ పూర్వకంగా టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. “దేశం కోసం తమ ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేసిన గొప్ప చరిత్ర గాంధీలకు ఉంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారు. సోనియాగాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారు.

బీజేపీ మత విద్వేష రాజకీయాల ద్వారా దేశాన్ని విభజిస్తుంటే, ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మన సుసంపన్నమైన సంస్కృతి, భిన్నత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్యంలో ఏకత్వం అనే సంప్రదాయాన్ని పెంపొందించేందుకు జోడో యాత్రను చేపడుతున్నారని అన్నారు. జూలై 22న రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ సభ్యులు ధర్నాలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీ-కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు శశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య‌, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, సునీత రావు, మల్లు రవి, బల్మూరు వెంకట్ తదితరులు పాల్గొనగా, టీ-కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ మాత్రం ఢిల్లీ ధర్నాలో పాల్గొన్నాడు.