Site icon HashtagU Telugu

Telangana Congress: రాహుల్ గాంధీ రాకతో తెలంగాణలో కాంగ్రెస్ లో వచ్చే మార్పులివేనా?

Tcongress

Tcongress

ముందస్తు ఎన్నికల ఊహాగానాల వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. అందుకే ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీతో సభను నిర్వహించడానికి ప్లాన్ చేసింది. వరంగల్ లో వచ్చే నెల ఆరో తేదీన రైతు సంఘర్షణ సభను నిర్వహిస్తుంది. దీనికి రావడానికి రాహుల్ గాంధీ పచ్చజెండా ఊపడంతో.. ఈ సభ నిర్వహణను సవాల్ గా తీసుకుంది టీపీసీసీ. ఈ ఒక్క సభతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పును తేవాలని.. కాంగ్రెస్ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని ప్లాన్ చేసింది. అందుకే జన సమీకరణకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి ఐదు లక్షల మందితో సభను జరపడానికి ఇప్పటికే స్కెచ్ సిద్ధమైంది. దీనికోసం క్షేత్రస్థాయిలో అప్పుడే సమీక్షా సమావేశాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో సమీక్షా సమావేశాలు పూర్తయ్యాయి. దీంతో లోకల్ గా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వెళతారు.

నిజానికి రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అలాంటి వారు ఇప్పుడు రాహుల్ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో కాంగ్రెస్ వర్గాలను విస్మయపరుస్తోంది. అయితే పార్టీ గెలవాలంటే లోకల్ గా గ్రూపులు వద్దని, కలిసికట్టుగా పనిచేయాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వల్లే వీరిద్దరూ సమన్వయంతో పని చేస్తు్న్నారంటున్నాయి పార్టీ వర్గాలు.

రాహుల్ సభ ద్వారా.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఉన్న శక్తి ఎంతో అధికార టీఆర్ఎస్ తో పాటు వివిధ పార్టీలకు తెలియాలని.. ప్రజల ఆలోచనల్లో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మార్పు తేవాలని టీపీసీసీ భావిస్తోంది. మరి ఈ సభతో కాంగ్రెస్ పరిస్థితి ఎంతవరకు మారుతుందో చూడాలి.