CM KCR: నో బీఆర్ఎస్.. ఓన్లీ టీఆర్ఎస్!

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన ‘దుష్పరిపాలన’పై నిప్పులు చెరిగారు.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 11:21 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన ‘దుష్పరిపాలన’పై నిప్పులు చెరిగారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు జాతీయ పార్టీని ప్రారంభిస్తానని కూడా ప్రకటించారు. కానీ రోజులు గడుస్తున్నా ఆ ప్రస్తావనే రావడం లేదు. అటు  సీఎం కేసీఆర్ నుంచి, ఇటు టీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే కేసీఆర్ ఎప్పుడైతే మోడీ నాయకత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారో, అప్పట్నుంచే బీజేపీ సైలంట్ గా తెలంగాణపై గురి పెట్టింది. చాపకింద నీరులా తమ కార్యక్రమాలను విస్తరించడం మొదలుపెట్టింది. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ ముందుగా ఇంటి పార్టీ (టీఆర్ఎస్) చక్కదిద్దుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఆయన నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం కూడా బీఆర్ఎస్ ఇప్పట్లో సాధ్యంకాకపోవచ్చని తెలుస్తోంది.

రాజకీయ సంస్థకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అని పేరు పెట్టనున్నాడని, త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తానని అనధికారికంగా చర్చ జరిగింది. అయితే జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ తన ప్రాజెక్టు (బీఆర్ఎస్) నుంచి వెనక్కి తగ్గినట్లు చర్చ జరుగుతోంది. నిజానికి కేసీఆర్ జాతీయ పార్టీ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఆసక్తిని రేకెత్తించింది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే తెలంగాణ సీఎం ఈ దిశగా మరో అడుగు ముందుకేసే అవకాశం ఉందని సమాచారం. జాతీయ పార్టీని ప్రారంభించి, వచ్చే మూడు వారాల్లో రాజకీయంగా మరింత కసరత్తు చేయాలన్న ఆలోచనను కేసీఆర్ వాయిదా వేసినట్లు సమాచారం.

కేసీఆర్ తన జాతీయ పార్టీని ప్రారంభించే విషయమై ఆర్థికవేత్తలతో పాటు వివిధ రంగాల్లోని నిపుణులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన పార్టీ కార్యాలయం ప్రగతి భవన్‌లో ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు. వ్యూహకర్త పీకే కొంతవరకు కార్యచరణ మొదలుపెట్టినప్పటికీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేక పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ ముందుగా టీఆర్ఎస్ పై ఫోకస్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే జాతీయ సమావేశాలతో బీజేపీ తెలంగాణపై ప్రభావం చూపింది. బీజేపీ అగ్రనేతలు సైతం నియోజకవర్గాలపై ఫోకస్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నట్టు సమాచారం. టీఆర్ఎస్ బలోపేతం కోసం సీఎం జిల్లాల పర్యటనను ఈ నెల 20 అనంతరం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు విజయావకాశాలపై ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. కొందరు నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకూ సన్నాహాలు చేసుకుంటున్నారు. వీటన్నింటినీ చక్కదిద్దేందుకు జిల్లాలకు వెళ్లాలని సీఎం నిర్ణయించుకున్నట్టు వివిధ రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.