Telangana Cabinet :ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో రైతు భరోసా, రేషన్ కార్డుల విధివిధానాలపై, భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీపై, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై చర్చించే అవకాశం ఉంది. నూతన రేషన్ కార్డుల జారీపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో 46 లక్షల కుటుంబాలకు ఎటువంటి వ్యవసాయ భూమి లేదు. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలి గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వచ్చే నెల సంక్రాంతి 14 వ తేదీ నుండి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. దీనిపై కూడా చర్చించనున్నారు. ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమిలేని, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకం గురించి ఈ కేబినెట్ లో చర్చించనున్నారు.