హైదరాబాద్ లో మీరు క్యాబ్ లో ప్రయాణించాలనుకుంటున్నారా? ఎండ దంచేస్తోంది.. ఉక్కపోతగా ఉంది.. అయినా క్యాబ్ డ్రైవర్ ఏసీ పెట్టడం లేదా? సరే.. మీరే అడుగుదామని సిద్ధపడ్డారా? అలా అడిగితే మీ జేబు గుల్లే. ఎందుకంటే క్యాబ్ లలో ఏసీ పెట్టాలంటే.. ఎక్స్ ట్రా ఇవ్వాల్సిందే అంటున్నారు డ్రైవర్లు. అదేంటి.. ఏసీ బండిని బుక్ చేసుకున్నప్పుడు ఏసీ పెట్టడానికి మళ్లీ ఎక్స్ ట్రా ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. దాని ‘నో ఏసీ’ ఉద్యమాన్ని చూపిస్తు్న్నారు.
యాప్ ద్వారా బుక్ చేసుకునే బండ్లలో ఏసీ కావాలంటే రూ.50లు అదనంగా ఇవ్వాల్సిందే అని క్యాబ్ డ్రైవర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసేశారు. దీంతో ఈ బాదుడు ప్రభావం ప్రయాణికులపై పడుతుంది. యాప్ సంస్థలు డ్రైవర్లకు ఇచ్చే కమీషన్ ను రెండేళ్లుగా పెంచడం లేదని.. అందుకే ఇలా చేయక తప్పలేదంటోంది.. గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్. క్యాబ్ బుక్ చేసినా సరే.. ఏసీ ఆపేస్తున్నారు. ఒక వేళ మీరు ఏసీ అడిగితే.. కొందరు 25 కిలోమీటర్ల వరకు అయితే అదనంగా రూ.25-50, మరికొందరు 25-50 కిలోమీటర్ల దూరానికి రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేస్తు్న్నారు.
రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా.. ఓలా, ఉబర్ సంస్థలు బేస్ ఫెయిర్ పెంచలేదన్నది వీరి ఆవేదన. అందుకే ఇప్పుడు ఇస్తున్న బేస్ ఫేర్ రూ.12-13 లను.. రూ.24-25 వరకు పెంచాల్సిందే అని డిమాండ్ చేస్తు్న్నారు. ఇలా ఫేర్ పెంచితేనే ప్రయాణికులకు ఏసీ వేస్తామని.. లేకపోతే ‘నో ఏసీ’ ప్రచారం ఉధృతం చేస్తామంటున్నారు. కోల్ కతాలో ప్రారంభమైన నో ఏసీ ఉద్యమం.. ఢిల్లీ, ముంబై, లఖ్ నవూ కు విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్ లో షురూ అయ్యింది.
అసలే ఇది వేసవి కాలం. ఇప్పుడు ఏసీ లేకుండా ప్రయాణం అంటే చాలా కష్టం. అందులోనూ వృద్దులు, మహిళలు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు కూడా క్యాబుల్లో ప్రయాణిస్తుంటారు. అలాంటివారు చల్లదనం లేకుండా ఉండలేరు. అందుకే ఇలాంటివారికి మినహాయింపును ఇవ్వాలని కొందరు ప్రయాణికులు కోరుతున్నారు.