Site icon HashtagU Telugu

Telangana Assembly : మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం

Telangana Assembly condoles Manmohan Singh

Telangana Assembly condoles Manmohan Singh

Telangana Assembly : భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మన్మోహన్‌ సింగ్‌ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. ఆర్థిక సంస్కరలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు.

మన్మోహన్ సింగ్ అందించిన సేవలు మరువలేనివన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్టీఐ, ఉపాధి, ఆధార్ వంటి ఎన్నో సంస్కరణలు తెచ్చారని సీఎం రేవంత్ చెప్పారు. నీతి నిజాయితీ విషయంలో మన్మోహన్ సింగ్ తో పోటీ పడేవారు నేటి తరంలో ఎవరూ లేరన్నారు. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ సిద్ధించిందని చెప్పారు. భూసేకరణ చట్టంతో బాధితులకు న్యాయం చేశారు. సరళీకృత విధానాలతో ప్రపంచంతో పోటీపడేలా చేశారన్నారు. పదేళ్లు అద్భుతమైన పాలన అందించారని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రపంచీకరణ,సరళీకరణతో దేశగతిని మార్చారన్నారు. మన్మోహన్ ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నేటికి పాటిస్తున్నాం..అన్నారు.

ఐటీలో నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందంటే అందుకు మన్మోహన్ నిర్ణయాలే కారణం. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్థికవేత్త, మానవతావాది మన్మోహన్ సింగ్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా విశేష సేవలు అందించారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ దశ దిశను మార్చింది. కాగా, మన్మోహన్ మృతితో ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించి ప్రభుత్వం అమలు చేస్తోంది. సంతాప దినాలలోనే మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపి, శాసనసభ వేదికగా ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.

Read Also: Astrology : ఈ రాశివారి ఈరోజు ఉద్యోగంలో అధిక పనిభారం ఉండవచ్చు.!