Site icon HashtagU Telugu

Medical College in TS : ఇక జిల్లాకో మెడిక‌ల్ కాలేజి

Medical Colleges

Medical Colleges

మెడిక‌ల్ కాలేజిల హ‌బ్ గా తెలంగాణ రాష్ట్రం రూపొంద‌నుంది. వ‌చ్చే రెండేళ్ల‌లో 33 జిల్లాల‌కు ఒక్కో మెడిక‌ల్ కాలేజిచొప్పున అందుబాటులోకి రానున్నాయి. ఆ మేర‌కు ఈ ఏడాది బ‌డ్జెట్ లో రూ. 1000 కోట్లను కేసీఆర్ స‌ర్కార్ కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంది. సోమవారం 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను పెట్టిన‌ ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు కొత్త మెడికల్ కాలేజీలను రూ. 1,000 కోట్లు కేటాయించిన‌ట్టు ప్ర‌క‌టించాడు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వచ్చే రెండేళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభంకానున్నాయి. 2023లో మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల్ మరియు యాదాద్రి అనే ఎనిమిది జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించనున్నారు.హైదరాబాద్‌లో తగినంత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కోసం నగరంలోని నాలుగు వైపులా తెలంగాణ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. “గచ్చిబౌలి, ఎల్‌బి నగర్, అల్వాల్ మరియు ఎర్రగడ్డలో ఈ ఆసుపత్రులు ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఒక్కోదానికి 1000 పడకలు ఉంటాయి. అదేవిధంగా నిమ్స్‌లో అదనంగా 2,000 పడకలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో నిమ్స్‌లో మొత్తం పడకల సంఖ్య 3,489కి పెరుగుతుందని హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పేద ప్రజలు తమ ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం కార్పొరేట్ ఆసుపత్రుల వైపు చూడాల్సిన అవసరం లేద‌ని తెలంగాణ స‌ర్కార్ చెబుతోంది.పాలిచ్చే తల్లుల రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, భద్రాచలం కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగుళాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్ వంటి తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌లను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మొత్తం మీద కేంద్రం ప్ర‌క‌టించిన మెడిక‌ల్ కాలేజీల పాల‌సీని అందిపుచ్చుకోవ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రుగుపెడుతోంద‌న్న‌మాట‌.