Aadhaar Card Racket: తెలంగాణలో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన ముఠా సూత్రధారి అరెస్టు..!!

ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ప్రస్తుతం ఆధార్ కార్డే ఆధారం.

  • Written By:
  • Publish Date - May 20, 2022 / 06:15 AM IST

ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ప్రస్తుతం ఆధార్ కార్డే ఆధారం. దీంతో ఆధార్ కార్డు కోసం జనం ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో నకిలీ ఆధార్ కార్డులిస్తూ దేశ భద్రతకు సవాలు విసురుతూ మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఫేక్ ఆధార్ కార్డ్ ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణలో మోసపూరితంగా దాదాపు 7,000 ఆధార్ కార్డులను తయారు చేసిన ఈ ముఠాకు చెందిన సూత్రధారిని, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గురువారం అరెస్టు చేశారు. ఈ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చిన ఐదు నెలల తర్వాత ముఠా అధినాయకుడిని పట్టుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మధ్య ప్రదేశ్ శివపురి జిల్లాకు చెందిన పవన్ కోటియా (29) అనే నిందితుడిని మధ్యప్రదేశ్ పోలీసుల సైబర్ నేర విభాగం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

“తెలంగాణ పోలీసులు అందించిన లీడ్స్ ఆధారంగా, సూత్రధారి అయిన పవన్ కోటియాను అరెస్టు చేసామని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. కాగా నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులకు ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేసిందని,ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఇండోర్ సైబర్ సెల్) జితేంద్ర సింగ్ తెలిపారు.

నిందితుడు కోటియాకు సైబర్ టెక్నాలజీలో మంచి ప్రావీణ్యం ఉందని, అస్సాం, మధ్యప్రదేశ్‌లోని గుర్తింపు పొందిన ఆధార్ సేవా కేంద్రాలకు సాంకేతిక సహాయం అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆధార్ 12 అంకెల సంఖ్యను తెలంగాణలో ఓ ముఠా ద్వారా తయారు చేస్తున్నట్లు, గుర్తించారు. ప్రభుత్వ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) అస్సాంలోని ఆధార్ సెంటర్‌ల లాగిన్ ఐడిలు, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి కోటియా నకిలీ కార్డులను తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని సింగ్ తెలిపారు.

ఈ లాగిన్ ఐడీలు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ల సాయంతో తెలంగాణలో దాదాపు 7,000 కొత్త ఆధార్ కార్డులను జారీ చేశారని, వాటి వివరాలను సేకరించామని పోలీసు అధికారి తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ముఠాలోని ఎనిమిది మంది సభ్యులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని సింగ్ చెప్పారు. ఈ అరెస్టుల తర్వాత కోటియా అస్సాం నుంచి పారిపోయి ఇండోర్‌లో తలదాచుకున్నాడని తెలిపారు..