Site icon HashtagU Telugu

Food Poisoning: విద్యార్థిని ప్రాణాలు తీసిన షవర్మ.. మరో 18 మందికి ఆసుపత్రిలో చికిత్స

student hospitalised

student hospitalised

ఈరోజుల్లో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. అందుకే బయట వేడివేడిగా ఏది కంటికి ఇంపుగా కనిపిస్తే దానిని తినేస్తున్నారు. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో కొందరు విద్యార్థులు కూడా అలాగే షవర్మా తిందామనుకున్నారు. దీంతో ఒకరు కాదు.. ఇద్దరు కాదు. మొత్తం 19 మంది విద్యార్థులు దానికోసం బయలుదేరారు. కానీ వారిలో ఒకరికి అదే షవర్మా ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయారు.

చెరువత్తూరులో ఉన్న ఓ స్కూల్ కు చెందిన విద్యార్థులు సరదాగా ఫాస్ట్ ఫుడ్ తిందామనుకున్నారు. అలా అనుకునే 19 మంది స్టూడెంట్స్ తమకు దగ్గరలో ఉన్న ఓ షాప్ కి వెళ్లారు. అక్కడే షవర్మా కూడా ఉంది. దీంతో విద్యార్థులంతా ఆ షవర్మాను తిన్నారు. తరువాత జ్యూస్ తాగారు. కానీ అది కలుషిత ఆహారం కావడంతో వాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో కరివళ్లూర్ కు చెందిన 16 ఏళ్ల దేవానంద అనే బాలిక కన్హాన్ గడ్ లోని జిల్లా హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది.

ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇతర విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉంది. ఈ ఘటనపై ఆందోళన చెందిన తల్లిదండ్రులతోపాటు ఆ స్కూల్ యాజమాన్యం.. ఈ ఘటనకు ఆ హోటలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. పోలీస్ కేసు పెట్టారు. కేసు సీరియస్ గా మారడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.

కేరళ రాష్ట్ర మంత్రి ఎంవీ గోవిందన్ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మొత్తం వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ ఆరోగ్య శాఖా మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. బాధిత విద్యా్ర్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది.

షవర్మా అనేది లెవాంటైన్ వంటకం. మాంసాన్ని తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుతారు. దానిని బన్ లో పెట్టి బేక్ చేసి ఇస్తారు. కేరళలో ఇది చాలా సంవత్సరాలుగా ఉంది. చాలామంది ఇష్టంగా తింటారు. హైదరాబాద్ లో కూడా చాలా షాపులు ఉన్నాయి. కాకపోతే అలా అందిస్తున్న ఆహారంలో నాణ్యతపైనే అందరిలో ఆందోళన నెలకొంది.