Site icon HashtagU Telugu

Chennai : చెన్నైలో విషాదం.. భ‌వ‌నం గోడ కూలి టెక్కీ మృతి

Deaths

Deaths

చెన్నైలోని థౌజండ్ లైట్స్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. కూల్చివేస్తున్న శిథిలావస్థలో ఉన్న భవనం గోడ పడటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. మృతురాలు మధురైకి చెందిన పద్మప్రియగా గుర్తించారు. ఈ ఘటన జరిగినప్పుడు ప్రియ తన స్నేహితురాలితో కలిసి థౌజండ్ లైట్స్ మెట్రో స్టేషన్ నుంచి తన ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెపై గోడ పడడంతో స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రెస్క్యూ సిబ్బంది, పోలీసు అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని శిథిలాల కింద నుంచి ఆమెను బయటకు తీశారు. ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. భవనాన్ని కూల్చివేసేందుకు ఉపయోగిస్తున్న యంత్రాల నుంచి వచ్చిన భారీ కంపనల కారణంగా గోడ కూలిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై థౌజండ్ లైట్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.