Site icon HashtagU Telugu

Team India : కొత్త ఏడాదిలో టీమిండియా టార్గెట్స్ ఇవే

Team India New

Team India New

భారత క్రికెట్‌ జట్టుకు గత ఏడాది మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలపై కన్నేసింది కోహ్లీసేన. టెస్ట్ ఫార్మేట్ వరకూ కొత్త ఏడాదిలో తొలి టార్గెట్ సఫారీ గడ్డపై సిరీస్ విజయం. సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఇదే జోరు కొనసాగించి మిగిలిన రెండు టెస్టుల్లో ఒక్కటి గెలిచినా సఫారీ గడ్డపై చారిత్రక సిరీస్ విజయాన్ని కైవసం చేసుకుంటుంది. గత ఏడు పర్యాయాలు సఫారీ టూర్‌కూ వచ్చినా టెస్ట్ సిరీస్ విజయం మాత్రం అందని ద్రాక్షగా మిగిలింది. దీంతో ప్రస్తుత ఫామ్ చూస్తే ఈసారి సౌతాఫ్రికాలో సిరీస్ సాధించడం కోహ్లీసేన ముందున్న మొదటి లక్ష్యంగా చెప్పొచ్చు.

అలాగే కొత్త ఏడాదిలో భారత్‌ ముందున్న రెండో టార్గెట్ ఆసియాకప్‌. ఆసియా కప్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా రికార్డున్న భారత్ ఇప్పటి వరకూ ఏడుసార్లు టైటిల్ గెలుచుకుంది. గత రెండు పర్యాయాలు రోహిత్‌శర్మ కెప్టెన్సీలోనే ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ పగ్గాలు అందుకున్న నేపథ్యంలో 2022 ఆసియాకప్‌లో ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది.ఇంగ్లాండ్ గడ్డపై అరుదైన టెస్ట్ సిరీస్ విజయం కూడా భారత్‌ను ఊరిస్తోంది. గత ఏడాది ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే కోవిడ్ కారణంగా చివరి మ్యాచ్ వాయిదా పడింది. ఈ మ్యాచ్‌ను జూన్‌లో నిర్వహించేందుకు రెండు దేశాల బోర్డులు అంగీకరించాయి. ఆ సిరీస్‌కు కొనసాగింపుగానే జరగనున్న ఈ టెస్టును భారత్ డ్రా చేసుకున్నా ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్ట్ సిరీస్‌ విజయాన్ని అందుకుంటుంది.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌ భారత్‌కు సవాల్‌గానే చెప్పాలి. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ కూడా చేరలేకపోయిన మన జట్టు ఈసారి మాత్రం టైటిల్ అందుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. కొత్త కెప్టెన్‌ రోహిత్‌శర్మకు ఈ ఏడాది మేజర్ ఛాలెంజ్‌ ఇదే అనడంలో సందేహం లేదు. ఇక ఏడాది చివర్లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలవడం కూడా భారత్‌ ముందున్న మరో టార్గెట్. మొత్తం మీద తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ మధ్య భారత జట్టు ఈ లక్ష్యాల్లో ఎన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Exit mobile version