Site icon HashtagU Telugu

India vs SL: లంకతో తొలి టీ ట్వంటీకి భారత్ రెడీ

Team India New Feb 2

Team India New Feb 2

సొంతగడ్డపై వరుస విజయాలతో జోష్ మీదున్న టీమిండియా ఇప్పుడు శ్రీలంకతో సిరీస్‌కు రెడీ అయింది. గురువారం లక్నో వేదికగా తొలి టీ ట్వంటీ జరగబోతోంది. ఇటీవలే విండీస్‌ను వన్డే, టీ ట్వంటీ సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌ లంకపైనా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పలువురు ఆటగాళ్ళు గాయాలతో దూరమైనప్పటకీ అన్ని విభాగాల్లో పూర్తి ఫామ్‌లో ఉంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ విశ్రాంతి తీసుకోగా… సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ గాయాలతో దూరమయ్యారు.

విండీస్‌పై రాణించిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ , యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌పై అంచనాలున్నాయి. ఓపెనర్లుగా రోహిత్, రుతురాజ్‌ గైక్వాడ్‌ రానుండగా.. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఆడనున్నాడు. రిషబ్ పంత్ లేనప్పటకీ సంజూశాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా , పేసర్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడంతో తుది జట్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీ ట్వంటీ ప్రపంచకప్‌కు జట్టు కూర్పును సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్ కూడా భారత్‌కు కీలకంగానే భావిస్తున్నారు.

మరోవైపు సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాజయం చవిచూసిన శ్రీలంక భారత్‌కు ఎంతవరకూ పోటీనిస్తుందనేది డౌటే. యువ, సీనియర్ ప్లేయర్స్‌తో కూడిన లంక జట్టు నిలకడలేని ఆటతీరుతో ఇబ్బంది పడుతోంది. దీనికి తోడు మొదటి మ్యాచ్‌కు ముందు జట్టులో కోవిడ్ కలకలం మరో మైనస్‌ పాయింట్. గత రికార్డుల పరంగా లంకపై భారత్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకూ ఇరు జట్లూ 22 మ్యాచ్‌లలో తలపడగా… భారత్ 14 సార్లు, శ్రీలంక 7 సార్లు గెలిచాయి.

సొంతగడ్డపై భారత్ 8 మ్యాచ్‌లలో గెలిస్తే లంక 2 విజయాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే విండీస్‌పై టీ ట్వంటీ సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన రోహిత్‌సేనను నిలువరించాలంటే లంక అంచనాలకు మించి రాణించాల్సిందే. ఇక మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న లక్నో పిచ్‌పై స్పిన్నర్లు కీలకం కానున్నారు. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గుచూపే అవకాశముంది.