Zomato Boy: జొమాటో సైకిల్ డెలివరీ బాయ్ కథ.. 24 గంటల్లోనే బైక్ కొనిచ్చిన నెటిజన్లు!

అసలే ఎండాకాలం. ఆపై రాజస్థాన్. ఇంకేముంది నెత్తి మాడిపోతుంది. అలాంటి సమయంలో ఫుడ్ ఆర్డర్లు డెలివరీ ఇవ్వడమంటే మాటలు కాదు. అది కూడా సైకిల్ పై వెళ్లి డెలివరీలు చేయాలంటే మరీ కష్టం. అయినా సరే.

  • Written By:
  • Publish Date - April 13, 2022 / 12:02 PM IST

అసలే ఎండాకాలం. ఆపై రాజస్థాన్. ఇంకేముంది నెత్తి మాడిపోతుంది. అలాంటి సమయంలో ఫుడ్ ఆర్డర్లు డెలివరీ ఇవ్వడమంటే మాటలు కాదు. అది కూడా సైకిల్ పై వెళ్లి డెలివరీలు చేయాలంటే మరీ కష్టం. అయినా సరే.. దుర్గామీనా మాత్రం ఆ సైకిల్ నే వేగంతా తొక్కుతూ రోజూ 10-12 డెలివరీలు చేసేవాడు. అలా ఏప్రిల్ 11న ఆదిత్య శర్మకు ఫుడ్ డెలివరీ చేశాడు. అతడి సైకిల్ ప్రయాణాన్ని గమనించిన ఆదిత్య.. దుర్గాతో మాటలు కలపడంతో అసలు స్టోరీ వెలుగులోకి వచ్చింది. అది సైకిల్ డెలివరీ బాయ్ అయిన దుర్గా జీవితాన్నే మార్చేసింది.

మిట్టమధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు మండిపోతున్న సమయంలో చెమటలు కక్కుతూ డెలివరీలు చేయడం చాలా కష్టం. కానీ దుర్గామీనా తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఇదే మార్గం. దుర్గా బీకాం చదువుకున్నాడు. 12 ఏళ్లపాటు టీచర్ గా చేశాడు. కానీ కరోనా పరిణామాల వల్ల అతడికి ఉద్యోగం పోయింది. అప్పుడే జొమాటో బాయ్ గా చేరాడు. సైకిల్ పై డెలివరీలు ఇవ్వడం కష్టమే అయినా వేరే దారిలేదు.

బైక్ కొనుక్కోవడానికి డబ్బులు కూడబెడుతున్నా అవి చాలడం లేదు. కనీసం డౌన్ పేమెంట్ కు కూడా సరిపడా డబ్బు సమకూరడం లేదు. తన కష్టాలను ఓపిగ్గా విన్న ఆదిత్యను ఓ సహాయం కోరాడు దుర్గా. డౌన్ పేమెంట్ కు సరిపడా డబ్బును సర్దుబాటు చేస్తే.. బైకు కొనుక్కుంటాని.. దానివల్ల ఎక్కువ డెలివరీలు చేస్తానని.. అలా అదనంగా వచ్చే డబ్బుతో అప్పు తీర్చేయడంతోపాటు.. నెలవారీ ఈఎంఐలు కట్టేస్తానని చెప్పాడు. కనీసం ఆన్ లైన్ టీచింగ్ కు కావలసిన ఏర్పాట్లు చేసినా పాఠాలు చెబుతానన్నాడు.

దుర్గామీనా కథ విన్న ఆదిత్య.. వెంటనే ఆ స్టోరీని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తలా ఒక రూపాయి సాయం చేసినా.. దుర్గామీనాకు బైక్ కొనడానికి సరిపడా డబ్బు సమకూరుతుందని ట్వీట్ చేశాడు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సాయం అందించాలన్నది ఆదిత్య ఉద్దేశం. ఇలా మెసేజ్ పెట్టిన 24 గంటల్లోపే దుర్గాకు బైక్ కొనుక్కోవడానికి అవసరమైన రూ.75,000 డబ్బు సమకూరింది. దీంతో దుర్గామీనాను బైక్ షోరూమ్ కు తీసుకెళ్లి.. అక్కడే బైక్ ను కొనేందుకు ఏర్పాట్లు చేశాడు ఆదిత్య. ఆ వీడియోను కూడా ట్వీట్ చేశాడు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.