TDP: ఏపీ మ‌హిళా కమిష‌న్ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

ఏపీ మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

  • Written By:
  • Updated On - April 27, 2022 / 05:28 PM IST

ఏపీ మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తెలుగుదేశం పార్టీ మ‌హిళా నాయ‌కులు కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాల‌యం వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో పోలీసులు మోహ‌రించారు. మ‌హిళ‌ల‌ను క‌మిష‌న్ కార్యాల‌యంలోకి వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్‌ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసనకు దిగారు. ఇందులో విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డ ప‌ద్మ‌ని.. వంగ‌ల‌పూడి అనిత ప్రశ్నించారు. విజయవాడతో సహా అన్ని అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం ”జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది” అనే పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందించారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని వాసిరెడ్డి పద్మ చెప్పారు.