ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత భహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు కాలకేయులుగా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అనిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని అనిత ఆరోపించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని లేఖ ద్వారా సీఎం జగన్‌కు తెలిపారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 1500 కు పైగా అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయని అనిత ఆరోపించారు. దిశ చట్టం కింద ఎవరికీ ఇప్పటి వరకూ శిక్ష విధించలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమని విమర్శించారు. ఆడబిడ్డలు అన్యాయమైపోతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు రక్షణ కరువవ్వడం నిజంగా బాధాకరమంటూ బహిరంగ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. మరి అనిత లేఖ పై వైసీపీ సర్కార్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.