TDP Protest : సిఎం జగన్ ధనదాహంతో మహిళల తాలిబొట్లు తెంచుతున్నాడు- చంద్ర‌బాబు

శ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

  • Written By:
  • Updated On - March 18, 2022 / 03:50 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై టీడీపీ ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిలదీసేందుకు పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌లు చేస్తోంది. రాష్ట్రంలో కల్తీ సారా ఏరులై పారుతోందని… కల్తీ మందు తాగి జనాలు చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి విప‌క్షాలు.

ఈ మరణాలపై చర్చించాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గత నాలుగైదు రోజులుగా పట్టుబడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాక‌పోవ‌డంతో ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. జనాల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా, ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్న కల్తీ సారా, మద్యం షాపుల్లో జే-బ్రాండ్ మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది తెలుగుదేశంపార్టీ. మార్చి 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నాయి. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు.

తన కమిషన్ల కోసం సిఎం జగన్ సొంత బ్రాండ్స్ తెచ్చి, నాణ్యత లేని మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. కల్తీ మద్యం వల్ల వెంటనే ప్రాణాలు పోతుంటే….జగన్ తెచ్చిన సొంత బ్రాండ్లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అసలు దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఎపిలోనే ఎందుకు ఉన్నాయి…వాటిని ఎవరు తయారు చేస్తున్నారు…ఎంతకు అమ్ముతున్నారు అనే విషయాలపై జగన్ సమాధానం చెప్పాలన్నారు. 60 రూపాయాలు ఉండే మద్యం బాటిల్ రేటును 120-150 రూపాయాలు చేసి….ప్రజలను దోచుకుంటున్నారని మండి పడ్డారు. తన సొంత బ్రాండ్ల ద్వారా జగన్ ఏడాదికి ప్రజల జేబుల నుంచి 5 వేల కోట్లు కాజేస్తున్నాడని అన్నారు. 5 ఏళ్లలో ఒక్క మద్యం ద్వారానే కమిషన్ల రూపంలో జగన్ 25-30 వేల కోట్లు ఆర్జిస్తున్నాడని చంద్రబాబు అన్నారు. జంగారెడ్డి గూడెంలో 27 మంది కల్తీ సారా వల్ల చనిపోతే…వాటిని సహజ మరణాలు అనిచెప్పిన సిఎం జగన్ వైఖరిని చంద్రబాబు తప్పు పట్టారు. మద్యం అధిక రేట్ల కారణంగా ప్రజలు మళ్లీ నాటుసారా వైపు వెళుతున్నారని….దీంతో ప్రాణాలు పోతున్నాయని బాధితులు చెప్పిన విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు.

జగన్ ది అసత్యాల ప్రయాణం:
వైఎస్ జగన్ తప్పుడు ప్రచారాలు ఏ స్థాయిలో ఉంటాయో ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడుతున్నాయని చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో అన్నారు. పోలీసు శాఖలో ఒకే సామాజికవర్గానికి చెందిన 37 మందికి డిఎస్పిలు గా ప్రమోషన్లు అనేది తప్పుడు ప్రచారం అని తేలిందన్నారు. టిడిపి హయాంలో నిఘా కోసం పెగాసస్ కొనలేదు అనే విషయాలు కూడా ఇప్పుడు ఆధారాలతో బయట పడ్డాయని అన్నారు. ప్రతి అంశంలో అసత్య ప్రచారాలు చేసిన జగన్ ను, వైసిపి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలని చంద్రబాబు క్యాడర్ కు పిలుపునిచ్చారు.