Paper Leaks: అత్యాచారాలు, పేప‌ర్ లీకులు టీడీపీవే : సీఎం జగన్

రాష్ట్రంలో జ‌రుగుతోన్న అత్యాచారాలు, పేప‌ర్ లీక్ ల పై ఏపీ సీఎం జ‌గ‌న్ తిరుప‌తి స‌భ‌లో స్పందించారు.

  • Written By:
  • Updated On - May 5, 2022 / 05:34 PM IST

రాష్ట్రంలో జ‌రుగుతోన్న అత్యాచారాలు, పేప‌ర్ లీక్ ల పై ఏపీ సీఎం జ‌గ‌న్ తిరుప‌తి స‌భ‌లో స్పందించారు. అత్యాచారాల నిరోధానికి ప్ర‌భుత్వం చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌ను చెప్ప‌కుండా ఎల్లో మీడియా, విప‌క్షాల మీద మండిప‌డ్డారు. అక్క‌డ‌క్క‌డా జరుగుతోన్న నేరాల‌ను బూత‌ద్దంలో పెట్టి చూపిస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అసాంఘిక శ‌క్తుల‌కు ప్ర‌భుత్వం నుంచి వార్నింగ్ ఇవ్వ‌కుండా రాజ‌కీయ కోణం నుంచి ఆయ‌న విప‌క్షాల‌పై విరుచుకు ప‌డ్డారు. ఏపీ పోలీసులు తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల గురించి వివ‌రించ‌లేక‌పోయారు. టెన్త్ ప‌రీక్ష పేప‌ర్ల లీక్ మీద జ‌గ‌న్ విచిత్రంగా స్పందించారు. నారాయ‌ణ‌, శ్రీచైత‌న్య కాలేజిలు పేప‌ర్ల‌ను లీక్ చేస్తున్నాయ‌ని వెల్ల‌డించారు. సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్ ఆయా సంస్థ‌ల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం విచిత్రం.

ఒక వేళ ఆ సంస్థ‌లు పేప‌ర్ లీక్ చేసిన‌ట్టు ఆధారాలు ఉంటే, వాటి గుర్తింపు ర‌ద్దు చేయ‌డానికి అవ‌కాశం ఉంది. పేప‌ర్ లీక్ పై విచార‌ణ చేశారా? ఒక వేళ విచార‌ణ ముగిస్తే చ‌ర్య‌లు ఏమి తీసుకున్నారు? అనే విష‌యాల‌ను చెప్పాల్సిన బాధ్య‌త సీఎంకు ఉంటుంది. త‌ద్బిన్నంగా కాలేజిల‌ను ల‌క్ష్యంగా చేసుకుని సీఎం హోదాలో జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సీఎం జ‌గ‌న్ `జ‌గ‌న‌న్న విద్యాదీవెన` నిధుల‌ను ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రాల లీజేపీపై స్పందించారు. పదో తరగతి ప్రశ్నాప‌త్రాల‌ను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. రెండు పేపర్లు నారాయణ స్కూల్ నుంచి లీక్ అయ్యాయన్న జ‌గ‌న్‌, మూడు పేపర్లు శ్రీచైతన్య స్కూల్ నుంచి లీక్ అయ్యాయని ఆరోపించారు.

వీళ్ళే పేపర్ లీక్ చేసి ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని ఆయ‌న‌మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా ప్రచారం చేశారని, వాట్సాప్ ద్వారా పేపర్‌లను బయటకు పంపి భయాందోళనలకు గురి చేయాలని చూశారని జగన్ విమర్శించారు. పేపర్ లీకులపై కొందరు దొంగ నాటకాలు ఆడుతున్నారని నారాయణ స్కూల్ ఎవరిదో తాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. ఆ స్కూల్ టీడీపీ నేతది కాదా? అని సీఎం ప్రశ్నించారు. మొత్తం మీద అత్యాచారాలు, రాష్ట్రంలో జ‌రుగుతోన్న వివిధ అసాంఘిక కార్య‌క‌లాపాలు తాజాగా జ‌రిగిన పేప‌ర్ లీకుల‌ను టీడీపీ జాబితాలోకి జ‌గ‌న్ వేశారు. అమ‌రావతిలో ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ నుంచి మాజీ మంత్రుల‌పై ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఇప్ప‌టి వ‌రకు జ‌గ‌న్ స‌ర్కార్ ఏ ఒక్క‌టీ నిరూపించలేదు. పైగా అత్యాచారాలు, హ‌త్య‌లు, పేప‌ర్ లీకుల‌ను కూడా టీడీపీ చేయిస్తుంద‌ని అధికారంలో ఉన్న జ‌గ‌న్ ఆరోపించ‌డం శోచ‌నీయం.