TDP: టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి భ‌ద్ర‌త క‌ల్పించండి.. డీజీపీకి లేఖ రాసిన టీడీపీ నేత వ‌ర్ల‌

  • Written By:
  • Updated On - March 9, 2022 / 09:42 AM IST

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య లేఖ రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో బైపాస్ రోడ్డు ప్రక్కగా సర్వే నంబర్లలో 392/1, 3, 4, 8, 9 & 10 లలో ఉంది. ఈ కార్యాల‌యానికి మాజీ సి.ఎం చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చి కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రజా కార్యక్రమాలకు హాజరవుతారని.. ఈ నేప‌థ్యంలో అసాంఘిక శ‌క్తుల నుంచి పార్టీ కార్యాల‌య‌నికి ముప్పు ఉంద‌ని లేఖ‌లో ప్ర‌స్తావించారు. చంద్రబాబు నాయుడు ఎన్.ఎస్.జి పరిధిలో గల జెడ్+ కేటగిరీ భద్రతా ఉంద‌ని.. ఆయనకు సంఘ విద్రోహ శక్తులు నుంచి ముప్పు ఉందని పేర్కోన్నారు.

19 అక్టోబర్ 2021న, అధికార వైసీపీకి చెందిన కొంతమంది గూండాలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని.. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పార్టీ కార్యకర్తలను చంపడానికి ప్రయత్నించారని లేఖ‌లో రాశారు. దాడి జరగక మునుపు కార్యాలయానికి 24 గంటలూ సాయుధ భద్రత ఉండేది. ఆశ్చర్యకరంగా, పార్టీ కార్యాలయానికి ఎటువంటి సమాచారం గానీ, నోటీసు గానీ ఇవ్వకుండా భద్రతను తొలగించారన్నారు. టిడిపి కార్యాలయం పోలీసు డైరెక్టర్ జనరల్ కార్యాలయం పక్కనే ఉన్నప్పటికీ అధికార పార్టీ అనుచరులుగా చెప్పుకుంటున్న గూండాలు దాడికి తెగబడ్డారని.. పై కారణాల దృష్ట్యా, పార్టీ కార్యాలయంపై ఎలాంటి దాడులు జరగకుండా, కార్యాలయాన్ని సందర్శించే ప్రజలకు రక్షణ కల్పించేందుకు 24 గంటలపాటు సాయుధ భద్రత కల్పించాలని అభ్యర్థిస్తున్నాని వ‌ర్ల రామ‌య్య డీజీపీ లేఖ రాశారు.