పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడుపోసుకుంటున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను పట్టపగలు దారుణంగా హత్య చేశారు. చంద్రయ్య మాచర్ల టీడీపీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. తోట చంద్రయ్య హత్యను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండిచారు. చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు మధ్యాహ్నం గుండ్లపాడుకు చంద్రబాబు వెళ్లనున్నారు. వైసిపి అరాచక పాలనలో ఇప్పటికే రాష్ట్రంలో పదుల సంఖ్యలో కార్యకర్తల ప్రాణాలు తీశారని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ రెడ్డి దారుణ పాలనపై తిరగబడుతున్న టిడిపి క్యాడర్ ను, ప్రజలను భయపెట్టేందుకే వైసిపి హత్యాంకాండ సాగిస్తుందని.. ఒక్క పల్నాడులోనే ఇప్పటికి పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమానికి వెళ్లిన టిడిపి నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై హత్యాయత్నం చేశారని.. ఆనాడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే వైసిపి బరితెగింపుకు అడ్డుకట్ట పడేదని చంద్రబాబు తెలిపారు. దాడులు చేసిన వారికి పదవులు కట్టబెట్టి తన విష సంస్కృతిని జగన్ చాటుకున్నారని. వైసిపి మూక చేతిలో హత్యకు గురయిన చంద్రయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.