TDP vs YCP : మ‌ద్య‌పాన నిషేధంపై వైసీపీ మాట‌ త‌ప్పి మ‌డ‌మ తిప్పింది – టీడీపీ

  • Written By:
  • Updated On - June 13, 2022 / 02:39 PM IST

ఏపీలో మ‌ద్య‌పాన నిషేధం చేస్తాన‌ని హ‌మీ ఇచ్చిన జ‌గ‌న్ మాట త‌ప్పార‌ని టీడీపీ మ‌హిళ నేత‌లు గ‌ద్దె అనురాధ‌, ఆచంట సునీత ఆరోపించారు. ఏపీలో మ‌ద్యానికి బానిసై 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని.. మద్యం విక్రయాలపై నిషేధం విధించాలని వారు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని.. అయినా ఆయన హామీని నిలబెట్టుకోలేదన్నారు. ముఖ్యమంత్రి విధానాలు ఏపీని ‘మరణాంధ్రప్రదేశ్‌’గా మార్చాయని.. కల్తీ మద్యం సేవించి 230 మంది చనిపోగా, శానిటైజర్ తాగి మరో 52 మంది చనిపోయార‌ని ఆరోపించారు.

హానికరమైన మ‌ద్యం బ్రాండ్‌లు తాగి కిడ్నీలు, కాలేయం, గుండె జబ్బులకు గుర‌వుతున్నార‌ని తెలిపారు. ముఖ్యమంత్రి అమ్మ ఒడి కింద రూ.14 వేలు ఇస్తున్నారని, నాన్న బడి కింద మద్యం విక్రయాల ద్వారా పేద కుటుంబాల నుంచి రూ.40 వేలకు పైగా తిరిగి తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రానున్న 15 ఏళ్ల పాటు మద్యం బాండ్లను నిషేధిస్తే మొత్తం చెల్లింపులు చేసి లిక్విడేట్ చేయాలన్న షరతుకు జగన్ మోహ‌న్ రెడ్డి అంగీకరించడం దారుణ‌మ‌ని తెలిపారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీప్ లిక్కర్ కేంద్రంగా మార్చిందని అనురాధ ఆరోపించారు. జగన్ మోహ‌న్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తమ వ్యక్తిగత ఖజానా నింపుకోవడం కోసం రాష్ట్రాన్ని చీప్ లిక్కర్, కల్తీ మద్యం, గంజాయి కేంద్రంగా మార్చారని మ‌హిళా నేత‌లు మండిపడ్డారు.