ఢిల్లీ మద్యం స్కామ్ తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతోపాటు, కొందరి బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ వ్యవహరంపై తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ మండిపడ్డారు. జనగామా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బిజెపి కార్యకర్తల అరెస్టును వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనకు దిగారు.
తమపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ నిరసన తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందంటూ బండి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నిరసనకు దిగడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడున్న కార్యకర్తలు పోలీసు జీపును అడ్డుకోవడంతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. కాగా మరో వివాదంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం అరెస్ట్ అయ్యారు.