Site icon HashtagU Telugu

Tanguturi Prakasam Panthulu : నేడు ఆంధ్రకేసరి 151 వ జయంతి

Tanguturi Prakasam Pantulu

Tanguturi Prakasam Pantulu

 

Tanguturi Prakasam Panthulu : తెల్లదొరలను దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రాణాలకు తెగించి, సర్వం త్యజించి పోరాడిన భరతమాత ముద్దుబిడ్డలెందరో…! అలాంటి సంగ్రామ యోధులలో ముఖ్యుడు, తెగువ చూపిన తెలుగువాడు టంగుటూరి ప్రకాశం. బ్రిటిష్ వాళ్ల హుంకరింపులకు ఏనాడు ఆయన అదరలేదు. తుపాకీలకు బెదరలేదు. భారతావని బానిస సంకెళ్లు తెంచేదాకా పట్టువిడవలేదు. అందుకే ప్రకాశం పేరు చెబితేనే తెలుగుజాతి గుండెల్లో గర్వం ఉప్పొంగుతుంది. నరనరానా నెత్తురు ఉరకలేత్తుతుంది..! న్యాయకోవిదుడు, రాజకీయ ఉద్ధండుడు, దేశసేవలో ఉదాత్తుడుగా మన్ననలు అందుకున్న మహనీయుడు ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు 151 వ జయంతి సందర్బంగా ప్రత్యేక కధనం.

ప్రకాశం (Tanguturi Prakasam Pantulu) బాల్యం – చదువు

1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ ఉత్తీర్ణుడవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ.లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు.

ప్రకాశం పెళ్లి – ఇంగ్లాండ్ ప్రయాణం :

ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపద సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు. ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.

ప్రకాశం (Tanguturi Prakasam Pantulu) స్వరాజ్య పత్రిక :

1907లో బారిష్టర్ వృత్తి లో ప్రవేశించిన ప్రకాశం 1921 దాకా ఆ వృత్తిని కొనసాగించారు. పెద్దపెద్ద జడ్జీల ఎదుట కూడా ధైర్యంగా వాదించడం లో ప్రకాశం వాదనా పటిమ అపూర్వం. భయమనే మాట ఆయన జీవిత నిఘంటువులోనే లేదు. న్యాయవాదిగా క్షణం తీరిక లేకుండా గడిపే ప్రకాశం గారి దృష్టి స్వాతంత్ర్య సంగ్రామం వైపు మరలింది. న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ప్రకాశం ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు.

దమ్ముంటే కాల్చండంటూ ప్రకాశం (Tanguturi Prakasam Pantulu).. తన ఛాతీని చూపించిన క్షణం :

1928, మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. మద్రాసులో ఒక యువకుడు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆ యువకుడిని కాల్చి చంపారు. ఆ యువకుడి శవాన్ని తీసుకు వచ్చేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. విషయం తెలుసుకున్న ప్రకాశం అక్కడకు చేరుకొని మృతదేహం వద్దకు వెళ్ల బోగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ముందుకు అడుగు వేస్తే కాల్చి చంపుతామంటూ వారు హెచ్చరించారు.

ఒక పోలీసు ప్రకాశం గుండెలకు తన తుపాకీని గురిపెట్టాడు. అయినప్పటికీ ప్రకాశం వెనుకడుగు వేయకుండా దమ్ముంటే కాల్చం డం టూ తన ఛాతీ చూపించడంతో ఆ పోలీసు భయపడి ఊరుకున్నాడు. ప్రకాశం ప్రదర్శించిన ధైర్య సాహసాలను అక్కడి ప్రజలు కొనియాడారు. ఆంధ్ర కేసరిగా పౌరుష సింహునిగా ఆయనను కీర్తించారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా ప్రకాశం కీలక పాత్ర పోషించారు. దేవరంపాడు లోని ప్రకాశం పంతులు భవనాన్ని శిబిరంగా కార్యకర్తలు ఉపయోగించుకున్నారు. ఉప్పు సత్యాగ్రహం విజయవంతం అయిన దానికి గుర్తుగా దేవరంపాడు లో విజయ స్తంభాన్ని ప్రతిష్టించారు.

ప్రకాశం (Tanguturi Prakasam Pantulu) ముఖ్యమంత్రి ప్రస్థానం :

1935 నవంబర్ 21 అప్పటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు దేవరంపాడు విజయ స్తంభాన్ని ఆవిష్కరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రకాశం ఆ సందర్భంగా ఒక ట్రస్ట్ డీ డును తయారు చేయించి తనకు గల భవనాన్ని..రెండు ఎకరాల పొలాన్ని స్వాధీనం చేశారు. 1937లో ప్రకాశం గారు కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశం గారు రెవె న్యూ మంత్రిగా ..ఆ తరువాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వ్యవహరించారు.

1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా ప్రకాశం పంతులు ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూల్ ను రాజధానిగా సూచించింది కూడా ప్రకాశం పంతులు. 13 నెలలపాటు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. తక్కువ కాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ ప్రకాశం పంతులు రాష్ట్ర ప్రగతికి అవసరమైన పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ..అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు చేపట్టారు.

ప్రత్యర్థుల కుట్రల వల్ల ప్రకాశం ఎక్కువ కాలం పాటు అధికారంలో కొన సాగలేక పోయారు. కుట్ర రాజకీయాలు ఆయన ప్రభుత్వాన్ని కుప్ప కూల్చా యి. అయినా ఆయన భయపడలేదు. ప్రజలే తన తోడుగా నీడగా ఆయన భావించి వారితోనే మమేక మయ్యారు.

ప్రకాశం (Tanguturi Prakasam Pantulu) మరణం :

1957 మే నెలలో ప్రకాశం పంతులుగారు వేసవి కాలంలో ఒంగోలు ప్రాంతంలో పర్యటించి తీవ్రమైన వడదెబ్బకు గురయ్యారు. ఆయనను హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి చేర్చి 18 రోజుల పాటు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 1957 మే 20న ప్రకాశం పంతులుగారు దివంగతులయ్యారు.

ప్రకాశం పంతులు మరణవార్త యావత్ భారత దేశాన్ని కదిలించింది. బారిస్టర్ గా లక్షల రూపాయలు విలువైన ఆస్తులను సంపాదించినప్పటికీ దేశ స్వాతంత్ర్య సాధన కోసం వాటిని తృణప్రాయంగా వెచ్చించి ప్రకాశం నిరుపేదగా మిగిలిపోయారు. చరిత్రలో ఇటువంటి త్యాగధనులు అరుదుగా కనిపిస్తారు. తన జీవితాన్ని ధనాన్ని దేశ సేవకు ప్రజాసేవకు వెచ్చించి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజల మనిషిగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు .