బెలారస్‌లో ఉక్రెయిన్, రష్యాల మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని వార్తలు వస్తున్నాయి. రష్యా వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలని, రష్యా బలగాలను వెనక్కు తీసుకోవాలని, అలాగే క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ నాటోలో చేరమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా షరతు విధించిందని సమాచారం.
అయితే నాటోలో చేరడంపై ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడానికి ఇష్పపడలేదని తెలుస్తోంది. దీంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చలు విఫలమయ్యాయని సమాచారం. ఈ చర‍్చలకు ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న కారణంగా, ఏ ఒక్క తీర్మానం లేకుండానే ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
