Heart Attack : గుప్పెడు గుండెకు ప్రమాదం…!!!

ఈ రోజుల్లో చాలామంది గుండెనొప్పితో మరణిస్తున్నారు. చిన్న వయస్సులోనే గుండెపోటు వస్తుంది. దీనికి చాలా కారణాలే ఉంటున్నాయి.

  • Written By:
  • Publish Date - February 27, 2022 / 10:34 AM IST

ఈ రోజుల్లో చాలామంది గుండెనొప్పితో మరణిస్తున్నారు. చిన్న వయస్సులోనే గుండెపోటు వస్తుంది. దీనికి చాలా కారణాలే ఉంటున్నాయి. ఒత్తిడి, శారీరక శ్రమ, అధిక బరువు, కొలెస్ట్రాల్, పొగతాగడం వంటి కారణాల వల్ల చాలామందికి హార్ట్ ఎటాక్ వస్తోంది. అయితే గుండెనొప్పి వచ్చే ముందు కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంతోనే సమస్య తలెత్తుతుంది.
హార్ట్ ఎటాక్ రావడానికి చాలా రోజుల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసతీసుకోవడం ఇబ్బంది, ఛాతిలోనొప్పి, బలహీనంగా ఉండటం, చేతులు పాదాల్లో స్పర్శ లేనట్లుగా అనిపించడం, ఎడమవైపు భుజాలు దవడల్లో నొప్పి ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి. అది ఖచ్చితంగా హార్ట్ ఎటాక్ కు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు ఎవరిలో అయితే తరచుగా కనిపిస్తుంటాయో వారు ఏమాత్రం అశ్రద్ధ చేయరాదు…వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చిన్ని పనిచేసినా తొందరగా అలసిపోతారు. మెట్లు ఎక్కలేకపోతారు. అంతకు ముందు హుషారుగా ఉన్నవారు కూడా శక్తి లేనట్లుగా ఉంటారు. బరువులు మోయలేరు. ఆయాసం, శ్వాసతీసుకోవడం ఇబ్బందులు, చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా కనిపించినట్లయితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

ఇక కోవిడ్ బారిన పడి…కోలుకున్న వారిలో ఈ లక్షణాలు కనిపించినట్లయితే వారు గుండెకు ప్రమాదం వాటిల్లుతుందని గుర్తించాలి. కాబట్టి అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో చాలా మందిలో ఊపిరితిత్తులు, గుండె దెబ్బతింటోంది. దీంతో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రక్తం గడ్డ కట్టం వల్లే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ బారినపడిన వారు కూడా పై లక్షణాలు కనిపిస్తే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.