Article 370 Hearings : కాశ్మీర్ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన 23 పిటిషన్లపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు (జులై 12న ) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 2 నుంచి సోమవారం, శుక్రవారం మినహా రోజువారీగా ఆ పిటిషన్లపై విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది. ఆగస్టు 2న (బుధవారం) ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభం అవుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. జూలై 25లోగా ఆన్‌లైన్ మోడ్‌లో 23 మంది పిటిషన్ దారులు ప్రతిస్పందనలను తెలియజేయాలని కోరింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని ఫైళ్లు, పత్రాలను పేపర్‌లెస్ మోడ్‌లో సమర్పించాలని(Article 370 Hearings) సూచించింది.
Also read : Rajamouli: మహేశ్ మూవీ తర్వాతనే రాజమౌళి మహాభారతం: విజయేంద్ర ప్రసాద్ బిగ్ అప్ డేట్!
“కేంద్ర ప్రభుత్వ జులై 10 అఫిడవిట్ ప్రభావం చూపదు”
జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం (జులై 10న) దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌ను విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ అఫిడవిట్ లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని కేంద్ర సర్కారు సమర్థించుకుంది. ఈ నిర్ణయం వల్ల కాశ్మీర్ లో అపూర్వమైన స్థిరత్వం, పురోగతి వచ్చాయని పేర్కొంది. అయితే తాము రాజ్యాంగపరమైన అంశాలపై మాత్రమే విచారణ జరుపుతామని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. కేంద్రం యొక్క కొత్త అఫిడవిట్ ఈ విచారణపై ఎటువంటి ప్రభావం చూపదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఆర్టికల్ 370లో ప్రస్తావన ఉంది. దీన్ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు ఆ రోజున రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీంతో ఆ అంశాన్ని సవాల్ చేస్తూ అప్పట్లో మొత్తం 23 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆర్టికల్ 370 రద్దయిన వెంటనే ఈ 23 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిపై మూడేళ్ళ 11 నెలల తర్వాత విచారణ జరుగుతుండటం గమనార్హం.
Also read : Power War : నోరుజారిన రేవంత్, కాంగ్రెస్లో ఉచిత విద్యుత్ వార్
ఈ ఇద్దరు.. పిటిషన్ ఉపసంహరించుకున్నారు
ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను ఐఏఎస్ అధికారి షా ఫైసల్, మాజీ విద్యార్థి ఉద్యమకారిణి షెహ్లా రషీద్‌లు ఉపసంహరించుకున్నారని సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషనర్ల జాబితా నుంచి ఈ ఇద్దరి పేర్లను తొలగించాలని సీజేఐ చంద్రచూడ్ కోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
పిటిషనర్లు ఎవరు ?
పిటిషనర్లలో అనేక మంది న్యాయవాదులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు ఉన్నారు. పిటిషనర్లలో న్యాయవాది ఎంఎల్ శర్మ, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన న్యాయవాది షకీర్ షబీర్, నేషనల్ కాన్ఫరెన్స్ లోక్‌సభ ఎంపీలు మహ్మద్ అక్బర్ లోన్, జస్టిస్ (రిటైర్డ్) హస్నైన్ మసూది, కాశ్మీర్ కోసం కేంద్ర హోం శాఖ యొక్క గ్రూప్ ఆఫ్ ఇంటర్ లొక్యూటర్స్ మాజీ సభ్యుడు రాధా కుమార్, కాశ్మీర్ మాజీ చీఫ్ సెక్రటరీ హిందాల్ హైదర్ త్యాబ్జీ, రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ కపిల్ కాక్, రిటైర్డ్ మేజర్ జనరల్ అశోక్ కుమార్ మెహతా, అమితాభా పాండే, మాజీ కేంద్ర హోం కార్యదర్శి గోపాల్ పిళ్లై తదితరులు ఉన్నారు.