Site icon HashtagU Telugu

42 SITs : ఆ హింసపై ఇన్వెస్టిగేషన్ కు 42 సిట్ లు.. వాటిపై ఆరుగురు డీఐజీ ర్యాంక్ అధికారుల మానిటరింగ్

Supreme Court

42 SITs :  మణిపూర్ హింసాకాండ బాధితులకు సంబంధించిన సహాయం, పునరావాస ఏర్పాట్లపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మహిళా మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటు చేసింది. జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్ నేతృత్వంలోని ఈ కమిటీలో జస్టిస్‌ (రిటైర్డ్‌) షాలినీ పీ జోషి, జస్టిస్‌ ఆశా మేనన్‌లు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. మణిపూర్ లో చట్టబద్ధ పాలనపై ప్రజలకు విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది. హింసాకాండ సమయంలో నమోదైన కేసుల దర్యాప్తును పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు మహారాష్ట్ర కేడర్ మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్‌ను నియమించాలని సుప్రీంకోర్టు సూచించింది.

Also read : Gaddar : ఎట్టకేలకు గద్దర్ మృతిపై స్పందించిన మావోయిస్టు పార్టీ..

సిట్ లను పర్యవేక్షించేందుకు.. 

సహాయం, పునరావాస చర్యలపై జస్టిస్ (రిటైర్డ్) మిట్టల్.. దర్యాప్తుపై మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్‌ తమకు ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తారని వెల్లడించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి తగిన భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశించింది. సీబీఐకి బదిలీ చేయని కేసులపై 42 సిట్ లు దర్యాప్తు చేస్తాయని సుప్రీం కోర్టు బెంచ్ వెల్లడించింది. ఆ సిట్ లను పర్యవేక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు డీఐజీ ర్యాంక్ అధికారులను నియమిస్తామని తెలిపింది. హింసతో ప్రభావితమైన ప్రతి జిల్లాల్లో 6 సిట్ లు ఏర్పాటవుతాయని చెప్పింది. హత్య కేసులను ఎస్పీ, సీనియర్‌ అధికారులు, లైంగిక నేరాలను మహిళా అధికారులు, ఇతర నేరాలను డిప్యూటీ ఎస్పీలు ఇన్వెస్టిగేట్ చేస్తారని బెంచ్ వివరించింది.

వారానికోసారి డీఐజీ, 15 రోజులకోసారి డీజీపీ సమీక్ష

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హాజరై గతవారం సుప్రీం ధర్మాసనం కోరిన నివేదికలను సోమవారం అందించారు. సుప్రీం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్‌ సింగ్‌ కూడా ధర్మాసనం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో హింస, వాటి నివారణకు ఇప్పటివరకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను వివరించారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలతో ముడిపడిన మొత్తం 12 కేసులనూ సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుల దర్యాప్తులో సహకారం కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు డీఎస్పీ ర్యాంక్ అధికారులను సీబీఐ తీసుకోవాలని సీజేఐ చంద్రచూడ్ ప్రతిపాదించారు. 42 సిట్ లు జరిపే దర్యాప్తులపై వారానికోసారి డీఐజీ, 15 రోజులకోసారి డీజీపీ సమీక్షిస్తారని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి చెప్పారు.