Maganoor Food Poisining Incident:మాగనూర్‌ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. చనిపోతే తప్పా పట్టించుకోరా?

"హైకోర్టు సీజే, ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా?" అని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ, ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.

Published By: HashtagU Telugu Desk
Highcourt Serious On Maganoor Food Poisining Incident

Highcourt Serious On Maganoor Food Poisining Incident

నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, ‘‘వారం రోజుల్లో మూడుసార్లు భోజనం వికటిస్తే, అధికారులు నిద్రపోతున్నారా?’’ అని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనని చాలా సీరియస్ అంశంగా అభిప్రాయపడిన హైకోర్టు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొంది.

ఈరోజు (బుధవారం) ఫుడ్ పాయిజన్ పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై హైకోర్టులో విచారణ జరిగింది. ‘‘ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా?’’ అని హైకోర్టు ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

హైకోర్టు, ఈ ఘటనను అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు పేర్కొంది. ‘‘ఈ సంఘటనపై సబ్ కలెక్టర్‌ నుంచి వివరాలు సేకరించడానికి ఒక వారం ఎందుకు?’’ అని సీజే జస్టిస్ అలోక్ అరాధే మండిపడ్డారు.

తదుపరి, హైకోర్టు సీజే, ‘‘అధికారులకు నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే, 5 నిమిషాల్లో వారు హాజరుకావచ్చు’’ అంటూ చురకలు వేయడంతో, ‘‘అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు కదా, వారి వద్ద మానవతా దృక్పథం ఉండాలి’’ అని అన్నారు.

అంతేకాక, భోజన విరామం అనంతరం ఈ ఘటనపై పూర్తి వివరాలను హైకోర్టుకు ఏఏజీ అందిస్తామని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ఫుడ్ పాయిజన్ సమస్య ఎదురవుతుందని చిక్కుడు ప్రభాకర్ హైకోర్టుకు తెలియజేశారు.

  Last Updated: 27 Nov 2024, 02:08 PM IST