MLC Kavitha: 26న జలవిహార్ లో బీసీ సంఘం సమావేశానికి మద్దతు: ఎమ్మెల్సీ కవిత

ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యి బీసీల అంశాలపై చర్చలు జరిపారు.

Published By: HashtagU Telugu Desk
Mlc Kavitha

Mlc Kavitha

హైదరాబాద్ : చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్ తో ఈనెల 26వ తేదీన జలవిహార్ లో బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శనివారం రోజున వైఎస్ఆర్ సీపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యి బీసీల అంశాలపై చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. బీసీలు ఆర్థికంగా బలపడాలన్న ఆలోచనతో బీసీ బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. కుల వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రాయితీలు ప్రోత్సాహకాలను అందిస్తూ వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. బీసీ వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాల వారినీ ప్రభుత్వం విస్మరించడం లేదని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో ,పార్టీ పదవుల్లో అత్యంత వెనుకబడిన కులాల వారికి కేసీఆర్ అవకాశాలు కల్పించి చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లుపై తీర్మానం చేశామని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో , మార్కెట్ కమిటీ పదవుల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీలకు అనేక అవకాశాలు కల్పించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు నుంచే బీసీల డిమాండ్లపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. ఆర్ కృష్ణయ్య, వకులాభరణం కృష్ణమోహన్  లను 2004లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరికి సీఎం కేసీఆర్ తీసుకుని వెళ్లి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఆయా అంశాలపై వినతి పత్రాన్ని అందించారని చెప్పారు. కులగణన చేపట్టాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. బీసీల పట్ల తమ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదని, బీసీలకు రావాల్సిన వాటా, హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. జీవితాంతం బీసీల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యను కల్వకుంట్ల కవిత అభినందించారు.

  Last Updated: 23 Sep 2023, 05:04 PM IST