Sukhbhir Singh Badal: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దల్జీత్ సింగ్ చీమా ఎక్స్ వేదికగా వెల్లడించారు. సిక్కు మత సూత్రాలు ఉల్లంఘించిన వ్యక్తిగా ఆయనను అకల్ తఖ్త్ ఇటీవల ప్రకటించింది. దీంతో శిరోమణి అకాలీ దళ్ పార్టీకి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా చేసి, ఆ లేఖను పార్టీ వర్కింగ్ కమిటీకి పంపారు. ఈ విషయాన్ని ‘సాద్’ సీనియర్ నేత దల్జిత్ సింగ్ చీమా ధ్రువీకరించారు. ఇక తద్వారా కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం అవుతుంది.
కాగా, తన నాయకత్వంపై నమ్మకం ఉంచి తనకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సుఖ్‌బీర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అని దల్జీత్ తెలిపారు. త్వరలోనే నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. ఈ నెల 18న ఎస్ఏడీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్వీందర్ సింగ్ అధ్యక్షతన నిర్వహించనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో సుఖ్‌బీర్ రాజీనామాను ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. అయితే బాదల్ రాజీనామాకు గల కారణాలు వెల్లడించలేదు.
ఇక, శిరోమణి అకాలీ దళ్ ఒక ప్రజాస్వామిక పార్టీ అని, పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి ప్రతి ఐదేళ్లుకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని దల్జీత్ తెలిపారు. చివరిసారిగా 2019 డిసెంబర్ 14న ఎన్నికలు జరిగాయని, వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, సభ తుది నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికి మెజారిటీ ఉంటే వారు అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారని చెప్పారు. వచ్చే నెల డిసెంబర్ 14తో ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తుందని చెప్పారు.