కర్నాటకలోని ఉడిపి జిల్లాలో మంగళవారం మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో హిజాబ్ వివాదంపై విద్యార్థుల మధ్య ఘర్షణలను ఏర్పడ్డాయి.ఇరు వర్గాలు తమ మత విశ్వాసాలను ప్రదర్శిస్తూ పరస్పరం నినాదాలు చేసుకున్నారు. 25 మంది విద్యార్థులు కాషాయం కండువాలు, తలపాగాలు ధరించి కాలేజీ గేట్ వెలుపల గుమిగూడారు. అయితే వీరిని లోపలికి అనుమతించలేదు. అప్పటికే క్యాంపస్ లో ఉన్న కొందరు అమ్మాయిలు హిజాబ్ ధరించి గేట్ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గేట్‌ల వెలుపల ఉన్న విద్యార్థులు “జై శ్రీరామ్” నినాదాలు చేశారు. కొందరు విద్యార్థులు గేటు దూకి లోపలికి వచ్చి నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కాలేజీ యాజమాన్యం, టీచర్లు వారిని నిలువరించారు.
జనవరిలో ఉడిపి జిల్లాలోని కుందాపూర్‌లోని బిబి హెగ్డే కాలేజీలో ఆరుగురు ముస్లిం బాలికలు తలకు కండువాలు ధరించడం ప్రారంభించినందుకు తరగతి గదుల్లోకి ప్రవేశం నిరాకరించడంతో హిజాబ్ వివాదం చెలరేగింది. దళిత విద్యార్థులు హిజాబ్ ధరించిన బాలికలకు సంఘీభావంగా నీలం కండువాలు ధరించి నిరసనలు చేయడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఇప్పటి వరకు, ఉడిపిలోని రెండు ప్రైవేట్ పాఠశాలలు సహా ఏడు పాఠశాలల నుండి నిరసనలు వెల్లువెత్తాయి. మంగళవారం బాగల్‌కోట్ జిల్లాలో రాళ్లదాడి, లాఠీచార్జి జరుగగా, మాండ్యా జిల్లాలో బురఖా ధరించిన ఒక ముస్లిం యువతిపై కాషాయ దుస్తులు ధరించిన సహవిద్యార్థులు హల్ చల్ చేశారు. శివమొగ్గలోని బాపూజీ నగర్‌లోని ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ కాలేజీలో కొందరు విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని తొలగించి కాషాయ జెండాను ఎగురవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే అది బేర్ పోస్టు అని, కాషాయ జెండా ఎగురవేసినప్పుడు దానిపై జాతీయ జెండా లేదని పాఠశాల ప్రిన్సిపాల్ ధనంజయ్ బీఆర్ తెలిపారు.