సంక్రాంతి అంటే ఫెస్టివల్ ఆఫ్ కైట్స్. పలు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి పతంగులు ఎగరేసిన ఎక్కువగా తయారయ్యేది హైదరాబాద్ లోనే. ఇక్కడి ధూల్ పేటలో తయారయ్యే పతంగులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
చార్ సౌ సాల్ కా షహర్ లో
నాలుగు శతాబ్దాల నుండి ఇక్కడ పతంగులు ఎగరేసే కల్చర్ ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. కుతుబ్ షాహీల పాలనలో ప్రతి సంవత్సరం హేమంత బుతువులో పంతగుల పండగ జరిగేదని, ఇబ్రహీం కులీకుతుబ్ షా పంతగుల పండుగను గోల్కొండ కోటలో అధికారికంగా జరిపినట్లు హిస్టారియన్స్ చెపుతున్నారు. మెదట్లో పంతగులను కాగితాలతో చేసి, దాన్ని ఎగరేయడానికి దారానికి పలు మూలికలు రాసి మంజాను తయారుచేసి పోటీలు నిర్వహించేవారని తెలుస్తోంది.
కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ జాహీల కాలంలో పాతనగరపు మైదానాల్లో కైట్స్ ఫెస్టివెల్స్ జరిపేవారట. నిజాంల చివరి దశలో పంతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ కైట్స్ పడగొట్టిన వారికి బహుమతులు ఇచ్చేవారట. అయితే ఈ మధ్య పతంగుల హవా కొంత తగ్గుతూ వస్తోంది. స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో పిల్లల్లో ఆసక్తి తగ్గుతోంది.
గతంలో సంక్రాతి సమయంలో నాలుగు నెలల గిరాకీ ఉండేదని ఇప్పుడు పండగ ముందు నాలుగు రోజులు మాత్రమే ఉంటుందని దింతో పతంగులు చేస్తూ జీవితం గడిపేవారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తయారీదారులు చెబుతున్నారు. రోజుకి ఐదువందల పతంగులని తయారుచేయవచ్చని కానీ ఇప్పుడు ముడిసరుకుల ధరలు పెరిగాయని, తయారుచేసిన పంతగులు కూడా అమ్ముడుపోవడం లేదని పతంగులు తయారుచేసే కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా వల్ల పోలీసులు పతంగులు అమ్మనివ్వడం లేదని, ముడి సరుకులు తెచ్చుకోవడానికి బయటకొస్తే గంజాయి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ధూల్ పేట పంతగుల తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా మాంజా వచ్చాక పాతనగరంలో మాంజా దారం తయారుచేసే వారికి ఇబ్బందులు మొదలయ్యాయని మాంజా తయారీదారులు చెబుతున్నారు. చైనా మాంజా వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం వాటిని నిషేదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తక్కువ ధరలో వస్తోందని చైనా మాంజా వాడొద్దని దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవించే ప్రజలను ఆదుకోవాలని తయారీదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
(ధూల్‌పేట్ నుంచి వీడియో జర్నలిస్ట్ వెంకట్‌తో మా ప్రతినిధి సిద్ధార్ధ కల్లేపల్లి)