VH: కాంగ్రెస్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు రావు ఇంటిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు.

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు రావు ఇంటిపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లోని డీడీ కాలనీలోని ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేసిన దుండగులు ఇంటి ముందు పార్క్‌ చేసిన కారును అద్దాలను ధ్వంసం చేశారు. తన ఇంటిపై జరిగిన దాడి వివరాలను తెలిపిన వీహెచ్‌ బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానని ఇలాంటి దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో కనిపెట్టాల్సిన బాధ్యత పోలీసులదేనని తెలిపిన వీహెచ్ మాజీ పీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎంపీగా పని చేసిన తనకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి విన్నవించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వానికి ఆ మాత్రం బాధ్యత లేదా అని వీహెచ్ నిలదీశారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ ‌ చేశారు. హనుమంతరావు పై జరిగిన దాడిని కాంగ్రెస్ నేతలు ఖండించారు. వీహెచ్ కి ఫోన్ చేసి పరామర్శించిన పీసీసీ చీఫ్ రేవంత్ తెలంగాణ లో రోజు రోజుకూ శాంతి భద్రత లు క్షిణిస్తున్నాయని తెలిపారు. వీహెచ్ పై దాడి చేసిన దోషులను పోలీసులు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వి.హనుమంతరావు ప్రజల మనిషి ఎవరి ఆపద వచ్చిన ముందుంటారు అలాంటి వ్యక్తిపై దాడి ఏమిటని ప్రశ్నించిన రేవంత్ కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలని కోరారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు.